లామినేషన్ పేపర్ల కొరత.. పాస్‌పోర్ట్‌లు అందక పాకిస్థానీల అవస్థలు..
పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం అక్కడి పౌరులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. విదేశాల్లో చదువుకోవాలన్న, వేరే దేశాలకు వెళ్ళాలన్న ఆశలపై నీళ్లు చల్లుతోంది తాజాగా వెలుగు చూసిన ఓ కొరత.
పాకిస్తాన్ : దేశంలో లామినేషన్ పేపర్ల కొరత కారణంగా పాకిస్తాన్ పౌరులు తమ పాస్‌పోర్ట్‌లను పొందడంలో ఇబ్బంది పడుతున్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ బుధవారం నివేదించింది. పాస్‌పోర్ట్‌లలో ముఖ్యమైన భాగం లామినేషన్ పేపర్. ఇది సాధారణంగా ఫ్రాన్స్ నుండి దిగుమతి అవుతుంది. పేపర్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా పాస్‌పోర్టుల కొరత ఏర్పడిందని పాకిస్తాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ & పాస్‌పోర్ట్స్ (డీజీఐఅండ్ పి)ని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
విదేశాల్లో చదువుకోవాలని ఆశించిన విద్యార్థులు, నగదు కొరతతో దేశం నుంచి వెళ్లిపోవాలనుకున్న పౌరులు పాస్ పోర్టుల కొరత సమాచారంలో కంగుతిన్నారు. తమ జీవితాలు మెరుగుపడతాయన్న ఆశలు సన్నగిల్లడంతో దేశవ్యాప్తంగా ప్రజలు విచారం పడ్డారు. యూకే, ఇటలీ దేశాల్లోని విశ్వవిద్యాలయాలలో చేరిన అనేక మంది విద్యార్థులు తమ పాస్‌పోర్ట్‌లు సమయానికి రాకపోవడంతో వెళ్లలేకపోయారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం : పౌరులు పారిపోవడానికి వీలుగా గాజాలో ప్రతిరోజూ 4 గంటల యుద్ధ విరామం..
ప్రభుత్వ శాఖ అసమర్థతకు తాము మూల్యం చెల్లించుకోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం సంక్షోభాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తోందని, త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా డైరెక్టర్ జనరల్ ఖాదిర్ యార్ తివానా తెలిపారు. అయితే, తమకు ట్రావెల్ డాక్యుమెంట్లు కూడా అందకపోవడంతో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీనిమీద అమీర్ అనే ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తన పాస్‌పోర్ట్ సిద్ధంగా ఉందని అక్టోబర్‌లో తనకు డీజీఐ అండ్ పి నుండి టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని, అయితే సంబంధిత కార్యాలయానికి వెళ్లగా.. తన పాస్‌పోర్ట్ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పారని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌తో చెప్పుకొచ్చాడు. తన డాక్యుమెంట్ వచ్చే వారం వస్తుందని సెప్టెంబరు నుంచి పాస్‌పోర్ట్ కార్యాలయం వాగ్దానం చేస్తోందని, అయితే చాలా వారాలు గడిచినా ఇంకా రాలేదని ముహమ్మద్ ఇమ్రాన్ చెప్పారు.
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాలు రోజువారీగా గణనీయంగా తగ్గిన పాస్‌పోర్ట్‌లను ప్రాసెస్ చేస్తున్నాయని ధృవీకరించాయి. అంతకుముందు రోజుకు 3,000 నుండి 4,000 పాస్‌పోర్ట్‌లు ప్రాసెస్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 12 నుండి 13 వరకు ఉన్నాయి. పరిస్థితి అనిశ్చితంగానే ఉంది. చాలామంది దరఖాస్తుదారులు దీనివల్ల అవస్థలు పడుతున్నారు. అయితే, పాకిస్తాన్ లో ఇలా జరగడం ఇది మొదటిసారేం కాదు.. 2013లో, డీజీఐ అండ్ పి ప్రింటర్‌లకు డబ్బు చెల్లించకపోవడం, లామినేషన్ పేపర్లు లేకపోవడం వల్ల పాకిస్తాన్‌లో పాస్‌పోర్ట్ ప్రింటింగ్ ఆగిపోయింది.