అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం... స్పందించిన మోదీ
అమెరికా ఎన్నికల ముందు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపుతోంది. పెన్సిల్వేనియాలో ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపి గాయపరిచాడు. ట్రంప్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు.
అమెరికాలో ఎన్నికల ముందు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా పెన్సిల్వేనియాలో ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్‌కు గాయమైంది. అమెరికాలో కాల్పులు సర్వసాధారణం అయినప్పటికీ ఏకంగా మాజీ అధ్యక్షుడిపైనే కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.
పెన్సిల్వేనియాలో జరుగుతున్న ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరగ్గా.. ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ చేరారు. కింద పడిన ట్రంప్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, కింద పడిన ట్రంప్ ఒక్కసారిగా పైకి లేచి పిడికిలి బిగించి నినాదాలు చేశారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైనట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఆయన ముఖంపై రక్తం కారుతూ ఉంది.
అలాగే, ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ట్రంప్ భద్రతా సిబ్బంది హతమార్చారు. కాగా, దుండగుడు ఆరు రౌండ్లు కాల్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. సమీపంలోని భవనం పైనుంచి కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
ట్రంప్‌పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఖండించారు. ఈ ఘటనపై వివరాలు ఆరా తీశారు. అమెరికాలో హింసకు తావు లేదన్నారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ విచారం...
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరపడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని తెలిపారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.