షాకింగ్ వీడియో: నేరుగా ట్రంప్ తలకే గురిపెట్టిన క్రూక్స్.. తల తిప్పకపోయి ఉంటే..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. దుండగుడు థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరపగా.. ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు.
అమెరికాలో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. డెమోక్రట్లు, రిపబ్లికన్ల మధ్య పోరు సాగుతుండగా.. డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యా యత్నం జరిగింది. ఈ నెల 13వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరపడంతో అంతా ఉలిక్కిపడ్డారు. వెంట్రుక వాసిలో ట్రంప్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. ఆయన చెవి పైభాగాన్ని చీల్చుకుంటూ బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనను ప్రపంచ దేశాల నేతలు ఖండించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఒబామా సహా ఇతర మాజీ అధ్యక్షులు హింసా రాజకీయాలు తగదని ఆక్షేపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ఘటనను ఖండించారు.
కాగా, ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడు భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యాడు. వెంటనే విచారణ చేపట్టిన ఎఫ్‌బీఐ ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని గుర్తించింది. నిందితుడు 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అని, పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందినవాడని FBI అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుగొలిపే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ట్రంప్ ప్రచారం చేస్తున్న ప్రాంతానికి సమీపంలో ఓ భవంనపైకి ఎక్కి కాల్పులు జరిపాడు. భవనంపైకి ఎక్కే క్రమంలో పలువురు అతణ్ని వారించారు. వారి మాటను క్రూక్స్ పట్టించుకోలేదు. ఓ పోలీసు అధికారి వార్నింగ్ చేసినా క్రూక్స్ తన చేతిలో ఉన్న రైఫిల్ గురిపెట్టి బెదిరించాడు. దీంతో పోలీసు ఏమీ చేయలేదు. ఇంతలోనే నేరుగా ట్రంప్‌కు గురిపెట్టిన క్రూక్స్.. 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ సమీపంలో ఉన్న ఓ వ్యక్తి చనిపోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని చీల్చుకుంటూ వెళ్లిపోగా.. అదృష్టవశాత్తూ ఆయన చిన్నపాటి గాయంతో తప్పించుకున్నారు.
అయితే, నేరుగా ట్రంప్ తలకే క్రూక్స్ గురిపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన క్లోజ్‌అప్ షాట్ వీడియోల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. మ్యాథ్యూ క్రూక్స్ నేరుగా ట్రంప్ తల మధ్య భాగానికి గురిపెట్టగా.. తల తిప్పడంతో ప్రమాదం నుంచి బయటపడ్డట్లు ఈ వీడియో క్లిప్‌లో కనిపిస్తోంది. ట్రంప్ తలను పక్కకు వంచి తెరపై ఉన్న గ్రాఫిక్‌ను చూడటంతో పాటు మైక్ వైపు వంగడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. సీ3పీమీమ్ (C3PMeme) చిత్రీకరించిన ఈ వీడియోలో క్లియర్‌గా ఇది కనిపిస్తోంది. ట్రంప్ తల తిప్పడం వల్లే బుల్లెట్ తలలోకి దూసుకెళ్లకుండా చెవిలోకి దూసుకెళ్లినట్లు ఇజ్రాయెల్ స్పెషల్ ఆపరేషన్స్ చెందిన వెటరన్ ఆరోన్ కోహెన్ ఓ వార్తా సంస్థతో తెలిపారు.
అయితే, క్రూక్స్ ఎందుకు ట్రంప్‌పై హత్యాయత్నం చేశారన్న కారణం తెలియలేదు. హత్యాయత్నం వెనుక ఉన్న ఉద్దేశంపై అమెరికా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
అదృష్టవంతుడు ట్రంప్..
ఈ క్లోజ్‌అప్ వీడియో చూసి షాక్‌కు గురైన నెటిజన్‌లు స్పందిస్తున్నారు. ట్రంప్ తల కదిలించడం ఓ అద్భుతమని, దేవుడే ఆయన్ను కాపాడారని అంటున్నారు. క్రూక్స్ ప్రొఫెషనల్ స్నిపర్ అని, సరిగ్గా గురిపెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్ చెవిలో దేవదూత ‘కదలండి!!’ అని గుసగుసలాడినట్లు ఉందని, దేవుడే ట్రంప్‌ని రక్షించారని ఇలా రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.