అమెరికాలో ఫైజర్ టీకా తీసుకున్న ఓ వ్యక్తి అలెర్జీ బారిన పడ్డాడు. గతవారం బ్రిటన్ లో కూడా ఇలా ఫైజర్ టీకా తీసుకున్న ఇద్దరికి అలెర్జీ వచ్చింది. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదంటున్నాయి ఫైజర్ కంపెనీ వర్గాలు..వివరాల్లోకి వెడితే...

అమెరికాలో కోవిడ్ నిరోధక టీకా పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమయింది. అలాస్కాకు చెందిన ఓ ఆరోగ్య కార్యకర్తకు ఫైజర్ తీసుకున్న తరువాత అలెర్జీ లక్షణాలు కనిపించాయి. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

మంగళవారం వ్యాక్సిన్ ను తీసుకున్న కొద్ది నిముషాల్లోనే ఆ వ్యక్తిలో మార్పులు కనిపించాయి. బ్రిటన్ లో కూడా గతవారం ఇటుంటివే రెండు కేసులు వెలుగు చూశాయి. అయితే దీనికి కొన్ని రకాల మందులు, ఆహార పదార్థాల వల్ల కలిగే అనాఫిలాక్సిస్ అనే పరిస్థితే కారణమని అంటున్నారు. 

ఈ సమస్య ఉన్నవారు ఫైజర్-బయో ఎంటెక్ వ్యాక్సిన్ ను తీసుకోవద్దంటూ బ్రిటన్ వైద్య నిపుణులు సూచించారు. అయితే అలెర్జీ లక్షణాలున్న చాలామంది అమెరికన్లు ఈ టీకా తీసుకున్నప్పటికీ సురక్షితంగానే ఉన్నట్లు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. 

వ్యాక్సిన్లు, దానిలోని సమ్మేళనాల పట్ల ఎలర్జీ ఉన్నవారు మాత్రమే ఫైజర్ టీకాను వినియోగించవద్దని సంస్థ సూచించింది. అయితే అమెరికాలోని అలాస్కాకు చెందిన వ్యక్తికి గతంలో అలెర్జీ లేదని.. అతనికి చికిత్స అందిస్తున్న బార్ట్ లెట్ రీజనల్ హాస్పిటల్ వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యక్తిలో చికిత్స తరువాత అలెర్జీ లక్షణాలు తగ్గిపోయాయని కూడా వారు తెలిపారు. 

ఈ విషయమై ఫైజర్ స్పందిస్తూ.. అనాఫిలాక్సిస్ లేదా అలెర్జీ ఉన్నవారు సరైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే తమ వ్యాక్సిన్ ను తీసుకోవాలనే సమాచారాన్ని తమ టీకా లేబుల్ పై  స్పష్టంగా వివరించామని తెలిపింది. కాగా, తాజా సంఘటనల నేపథ్యంలో అవసరమైతే ఈ సమాచారాన్ని మరింత క్లియర్ గా, సరళమైన భాషలో వివరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.