మాయమాటలతో వేశ్యలను ఇంటికి పిలిచి.. చంపేసి, వంటగదిలో పాతిపెట్టి.. 14మందిని చంపిన సీరియల్ కిల్లర్..
ఓ సీరియల్ కిల్లర్ ఎవ్వరూలేని వేశ్యలను టార్గెట్ చేశాడు. వారిని ఇంటికి పిలిచి, చంపి, వంటగదిలో పూడ్చిపెట్టాడు. అలా 14మందిని హతమార్చాడు.

కిగాలీ : రువాండాలో ఓ సీరియల్ కిల్లర్ గురించి బుధవారం షాకింగ్ విషయం వెలుగు చూసింది. వేశ్యలను ఇంటికి పిలిచి, దోచుకుని.. చంపేసి వంటింట్లో పాతిపెట్టాడో వ్యక్తి. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 14మందిని హత్య చేశాడు. దీనికోసం అతను స్నేహితులు, బంధువులు లేని ఒంటరి వేశ్యలను ఎంచుకునేవాడు.
కొన్నిసార్లు అతను స్వలింగ సంపర్కులను కూడా ఎంచుకుంటాడు. వారిని తీయని మాటలతో తన అద్దె ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆపై బాధితుల ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుని చంపేస్తాడు. ఆ తర్వాత వంటగదిలో తవ్వి ని మృతదేహాలను పూడ్చాడు. ఇలా వరుస నేరాలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. రువాండా రాజధాని కిగాలీ (రువాండా)లో ఈ దారుణాలు జరిగాయి.
వార్నీ.. ధ్యానం చేయడం చూసి, మాస్ కిల్లింగ్ అని పొరపాటు..పోలీసులకు ఫోన్ చేయడంతో...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిగాలీ శివారు ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతను చాలా మంది సీరియల్ కిల్లర్లను అధ్యయనం చేశాడు. దీని ద్వారా ఎలా చంపాలో నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తులైతే తన మీద అనుమానం రాదని తెలుసుకుని.. అలాంటి వారిని ఎంచుకున్నాడు.
ముఖ్యంగా బార్లలో కలిసే వేశ్యలను, లెస్బియన్లను తన ఇంటికి ఆహ్వానించేవాడు. ఇంటికి రాగానే వారిని చంపి వారి ఫోన్లు, ఇతర వస్తువులు దొంగిలించేవాడు. ఇంట్లో వంటగదిలో గొయ్యి తవ్వి మృతదేహాలను పూడ్చిపెట్టేవాడు. ఈ సీరియల్ కిల్లర్ కొన్ని మృతదేహాలను యాసిడ్‌తో కరిగించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఈ విషయం వెలుగు చూడగా.. 10 మృతదేహాలు మాత్రమే లభ్యం కాగా, మొత్తం మృతుల సంఖ్య 14 వరకు ఉంటుందని భావిస్తున్నారు.
రువాండా ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఆర్ఐబీ) కేసు దర్యాప్తు చేస్తోంది. జులై నెలలోనే నిందితుడిని రువాండా పోలీసులు దోపిడీ, అత్యాచారం తదితర నేరాలకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో అప్పట్లో బెయిల్ మంజూరు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అతడి ప్రవర్తనపై నిఘా పెట్టిన పోలీసు బృందాలు మంగళవారం మళ్లీ హంతకుడి ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించాయి.
ఈ సందర్భంగా వంటగదిలో 10 మృతదేహాలను తవ్వి పూడ్చిపెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ల టీవీ షోలను చూసి హత్యలు చేయడం ఎలాగో నేర్చుకున్నట్లు నిందితుడు చెప్పినట్లు ఆర్ఐబీ అధికారి ఒకరు వెల్లడించారు.