రష్యాను ఉక్రెయిన్ దళాలు చావు దెబ్బ తీశాయి. ఆ దేశ సైన్యంలోని లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారిని హతమార్చాయి. యూకే అందించిన స్ట్రామ్ షాడో క్షిపణి సాయంతో ఉక్రెయిన్ దళాలు ఈ విజయం సాధించాయి. 

నెలలు గడుస్తున్నప్పటికీ ఉక్రెయిన్- రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే వుంది. తొలినాళ్లలో రష్యా పైచేయి సాధించినట్లు కనిపించినప్పటికీ.. అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు అందిస్తున్న ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. రష్యా గతంలో ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. తాజాగా రష్యాను ఉక్రెయిన్ దళాలు చావు దెబ్బ తీశాయి. ఆ దేశ సైన్యంలోని లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారిని హతమార్చాయి. యూకే అందించిన స్ట్రామ్ షాడో క్షిపణి సాయంతో ఉక్రెయిన్ దళాలు ఈ విజయం సాధించాయి. రాత్రివేళ బెర్డియాన్క్స్ నగరంలో జరిగిన దాడిలో రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఒలేగ్ యూరివిచ్ త్సొకోవ్ మరణించారు. ఈ విషయాన్ని మేరియుపొల్ మేయర్ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్ తెలిపింది. 

రష్యా ఆక్రమిత ప్రాంతంలోని దున హోటల్‌లో రష్యాకు చెందిన కీలక కమాండర్లు బస చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఉక్రెయిన్ దళాలు స్ట్రామ్ షాడో క్షిపణిని సంధించాయి. ఈ దాడిలో భవనం మొత్తం ధ్వంసమైంది. దీనికి దగ్గరలోనే యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ వున్నా అది షాడో క్షిపణిని ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. భవంతి ధ్వంసమవ్వగానే.. హోటల్ వద్దకు భారీగా అంబులెన్స్‌లు, భారీ పరికరాలతో కూడిన వాహనాలు వచ్చిన శకలాలను తొలగిస్తున్నట్లుగా ఉక్రెయిన్ వార్తా సంస్థలు చెబుతున్నాయి. 

ALso Read: పుతిన్‌తో మోడీ టెలిఫోన్ సంభాషణ ... ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ

ఈ ఘటనలో మరణించిన జనలర్ యూరివిచ్ రష్యాకు చెందిన 20వ కంబైన్డ్ ఆర్మీ సర్వీసులోని 144 మోటరైజ్డ్ రైఫిల్ డివిజన్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయనను టార్గెట్ చేసిన ఉక్రెయిన్ బలగాలు.. గతంలోనే లుహాన్స్క్‌పై జరిపిన శతఘ్ని దాడిలో యూరివిచ్ గాయపడ్డారు. ఈ దాడి తర్వాత ఆయనను లెఫ్టినెట్ జనరల్‌గా ప్రమోట్ చేశారు. యూరివిచ్ రెండు చెచెన్యా పోరాటాలతో పాటు రష్యా నిర్వహించిన ప్రతి యుద్ధంలోనూ పాల్గొన్నారు. క్రిమియా ఆక్రమణ సమయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన మరణంపై రష్యా అధికారిక ప్రకటన చేయలేదు.