ట్రంప్ కి అమెరికన్ మీడియా షాక్: ఇక ఆయన ప్రసంగాలను ప్రసారం చేయవా...?
ట్విట్టర్లో జెరి పెర్ల్ మాన్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన సిఎన్ఎన్, ఎన్బీసీ, ఏబీసీ, సీబీఎస్ మీడియా సంస్థలు అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడే ప్రసారాలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఈ మధ్య మితిమీరిపోయాయి. హుందాగా మాట్లాడాల్సిన వ్యక్తి ఆ పదవికే కళంకం తెచ్చేలా మాట్లాడడమే కాకుండా... అమెరికా అధ్యక్షుడి ప్రెస్ మీట్ అంటేనే ఒక జోక్ గా మార్చేశారు.
ఇక ఈ కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ మొదలైనప్పటి నుండి ట్రంప్ చర్యలు అమెరికన్ల ప్రాణాలను బలిగొంటున్నాయి. తొలుత ఈ కరోనా వైరస్ మహమ్మారి వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు అని దాని వ్యాప్తిని ఒక రకంగా పెంచి పోషించి వేల మంది అమెరికన్ల చావులకు పరోక్ష కారకుడయ్యాడు.
ఇక ఈ మహమ్మారి విలయతాండవం చేస్తుండగా ఆయన తప్పుడు సమాచారం వల్ల ప్రజలు మరణిస్తున్నారు. క్లోరోక్విన్ కరోనా కు మందు అని ఆయన అన్నాడో లేదో ఒక అమెరికన్ చేపల ఆక్వేరియంలు క్లీన్ చేసే ఆ క్లోరోక్విన్ ని సేవించి మరణించాడు. (హైడ్రాక్సీ క్లోరోక్విన్, క్లోరోక్విన్ రెండు వేర్వేరు మందులు)
ఇక ఆ తరువాత ట్రంప్ ఏకంగా ఈ కరోనా వైరస్ ని నయం చేయడానికి డెటాల్, లైజాల్ లను వాడొచ్చు కదా అంటూ వైద్యులకు ఉచిత సలహాలిచ్చారు. ఇలా తప్పుడు సమాచారాన్ని ఏకంగా అధ్యక్షుడే వైరల్ చేయడంపై అమెరికాలో తీవ్ర దుమారం చెలరేగుతుంది. ట్రంప్ డెటాల్, లైజాల్ వ్యాఖ్యలపై ఏకంగా వాటిని తయారు చేసే కంపెనీయే ఇవి మనుషుల మందులు కాదు అని అధికారిక ప్రకటన విడుదల చేయవలిసి వచ్చింది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్లో జెరి పెర్ల్ మాన్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన సిఎన్ఎన్, ఎన్బీసీ, ఏబీసీ, సీబీఎస్ మీడియా సంస్థలు అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడే ప్రసారాలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.దీనికి కారణంగా, అమెరికా ప్రజలను ట్రంప్ చెప్పే తప్పుడు సమాచారం నుంచి కాపాడడానికి ఈ నిర్ణయం అంటూ రాసుకొచ్చాడు.
ట్విట్టర్లో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది. దాదాపుగా రెండు లక్షల లైకులతోపాటుగా, సుమారు 41 వేల రీట్వీట్లు వచ్చాయి. ఈ వార్త నిజమా కాదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఈ వ్యక్తికి ఆ వార్త సంస్థకి ఎటువంటి సంబంధం లేకపోవడంతో.... ఆ సదరు మీడియా సంస్థలనే ఏకంగా సంప్రదించవలిసి వచ్చింది.
సిఎన్ఎన్ మాత్రం అలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదని చెప్పుకొచ్చింది. మిగిలినవారు ఇంకా సమాధానం ఇవ్వలేదు. మిగిలిన ఛానళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండకపోవచ్చు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే... అందరూ కలిసి తీసుకునేవారు కదా! ఇది అబద్ధమే అయినప్పటికీ.... ట్రంప్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు మాత్రం ఇది నిలువుటద్దంలా కనబడుతుంది.
ఇప్పటికే అక్కడి వివిధ ప్రఖ్యాత యూనివర్సిటీలు కొలంబియా నుంచి పెన్సిల్వేనియా యూనివర్సిటీ వరకు చాలా మంది మీడియా సంస్థలకు ట్రంప్ స్పీచ్ లను ప్రసారం చేయొద్దని, ఫేక్ న్యూస్ నుంచి అమెరికాను కాపాడాలని కోరారు. అమెరికన్ మీడియాలో కూడా 2018 నుంచి ఈ చర్చ కొనసాగుతుంది.