ఈ స్టోరీ చదివిన తరువాత అబ్బా.. అలాంటి పిల్లిగానైనా పుట్టాల్సింది అనుకుంటాం. ఎందుకంటే ఆ పిల్లికి అదృష్టం దరిద్రం పట్టినంత గట్టిగా పట్టుకుంది. చెత్తకుప్పలో పడి చచ్చిపోయే ఆ పిల్లి ఏకంగా మంత్రిగారి నివాసంలోకి అడుగుపెట్టింది. అంతేనా పర్యావరణ శాఖ ఉప మంత్రి హోదాలో రాజభోగం వెలగబెడుతోంది. సోషల్‌ మీడియా సెలెబ్రిటీ అయింది.

అసలిది ఎక్కడ? ఎలా జరిగింది? అంటే... గత సోమవారం రష్యాలోని ఉలియానోవ్స్క్లలో మున్సిపాలిటీ సిబ్బంది ఒకరు చెత్త క్రషింగ్ మెషిన్ దగ్గర చెత్తను అందులో వేస్తున్నాడు. ఇంతలో చెత్తలో ఉన్న ఓ తెల్లటి ప్లాస్టిక్‌ కవర్‌ కదలటం అతడు గమనించాడు. దాన్ని తెరిచి చూడగా అందులో ఓ పిల్లి కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు టీవీలో, సోషల్‌ మీడియా బాగా వైరలయ్యాయి. 

అవి చూసిన రష్యా పర్యావరణ మంత్రిత్వ శాఖ దాన్ని దత్తత తీసుకుంది. అనధికారికంగా దానికి పర్యావరణ శాఖ ఉప మంత్రి హోదాను కల్పించింది. మంత్రి గుల్‌నారా కఖ్మతులిన అది మంత్రి ఆఫీసులోని కుర్చీలో నిద్రపోతున్న, తిరగాడుతున్న ఫొటోలను షేర్‌ చేశారు. దానికి పేరు పెట్టడానికి ఓ కంటెస్ట్‌ను కూడా పెట్టారు. 

ఈ సంఘటన గురించి మంత్రి మాట్లాడుతూ.. ‘‘ పిల్లులు పెంచుకునే యజమానులే వాటి బాధ్యత వహించాలి. మీరు వాటిని సరిగా చూసుకోలేకపోతే.. మంచిగా పెంచుకునే వారికి అప్పజెప్పండి’’ అని తెలిపారు. ఇప్పుడు ఒప్పుకుంటారా? పిల్లిగానైనా పుట్టాల్సిందని..