మగవారితో సమానంగా తమకు కూడా డ్రైవింగ్ అనుమతిని ఇవ్వాలంటూ సౌదీ మహిళలు చేసిన సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. ఇది వరకు సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేయయటానికి వీలుండేంది కాదు. కానీ ఇప్పుడు వారు ఎంచక్కా స్టీరింగ్ పట్టుకోవచ్చు. సౌదీ అరేబియాలో ఇన్నాళ్లుగా మహిళల డ్రైవింగ్ విషయంలో కొనసాగుతున్న నిషేధాన్ని పరిపూర్ణంగా ఎత్తివేశారు.

వాస్తవానికి ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గతేడాది సెప్టెంబర్ నెలలోనే ప్రకటించినప్పటికీ, ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రావటానికి ఇంత సమయం పట్టింది. ఈ నెల ఆరంభం నుంచే సౌదీలో తొలిసారిగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.

యావత్ ప్రంపంచలోనే మహిళలను డ్రైవింగ్ చేయటానికి అనుమతించని ఏకైక దేశం సౌదీ అరేబియా. సౌదీలో ఇప్పటి వరకూ మహిళలు ఇళ్లు దాటి బయటకు వెళ్లాలంటే, తమ స్వంత కార్లు ఉన్నప్పటికీ ప్రైవేట్ డ్రైవర్లనే ఆశ్రయించేవారు. కానీ ఇకపై ఈ అవసరం లేదు, మహిళలే ఎంచక్కా డ్రైవింగ్ నేర్చుకొని తమ కారులో షికారు చేయవచ్చు.

మహిళల డ్రైవింగ్ విషయంలో నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, సౌదీ అరేబియాలో డ్రైవింగ్ స్కూల్స్ కలకలాడబోతున్నాయి. ఈ నిర్ణయం ప్రకటించిన మొదటి రోజునే, సౌదీలోని ప్రముఖ చమురు ఉత్పత్తి సంస్థ ఆర్మాకో తమ మహిళా సిబ్బందికి కారు నడిపించే శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. కాగా.. మహిళల డ్రైవింగ్ విషయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యావత్ ప్రపంచం స్వాగతిస్తోంది.