కొత్త సంవత్సర వేడుకల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని దేశాలు మాత్రం అందరికంటే ముందే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాయి. పసిఫిక్‌ మహా సముద్రంలోని ‘సమోవా’ ద్వీపం అందరికంటే ముందుగా 2021ని ఆహ్వానించింది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ 2021 వచ్చేసింది. ఆ కాసేపటికే టోంగా, కిరిబాటి దీవులు కూడా 2021లోకి అడుగుపెట్టాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌ వాసులు కూడా న్యూఇయర్‌ని ఆహ్వానించారు. భారత్‌లో సాయంత్రం 4.30 గంటలు అవుతున్నప్పుడు వెల్లింగ్టన్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. 

అక్కడే ఎందుకు ముందు:

ప్రపంచ కాలమానం ఇంగ్లాండ్‌లోని గ్రీన్‌విచ్‌ రేఖాంశం నుంచి ప్రారంభమవుతుంది. ఇది సున్నా డిగ్రీలుగా ఉంటుంది. ఈ రేఖాంశాల ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. భారత దేశం విషయానికి వస్తే, 82.5°E  ప్రకారం ఐఎస్‌టీ సమయం ఉంటుంది.  

ఏయే దేశాల్లో ఎప్పుడు..   

ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు కొత్త ఏడాది మొదలవుతుంది. ఇక సూర్యుడు ఉదయించే భూమిగా పేరున్న జపాన్‌ కూడా మూడున్నర గంటల ముందే 2021లోకి అడుగుపెడుతుంది. ఆ సమయంలోనే రెండు కొరియన్  దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. ఉపఖండ దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లు మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.  

భారత్‌లో ఎప్పుడు..

సమోవాలో న్యూఇయర్ వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు భారత్, శ్రీలంకల్లో క్యాలెండర్ డేట్ మారుతుంది. ఈ రెండు దేశాల తర్వాత నాలుగున్నర గంటలకు 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ సహా కాంగో, అంగోలా, కామెరూన్‌ దేశాలు ఉన్నాయి.  

అన్నింటి కంటే లాస్ట్...

భారత్‌లో జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌ కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. అమెరికా పరిధిలోని బేకర్‌, హోవార్డ్‌ దీవుల్లో కొత్త ఏడాది వేడుకలు చివరివి. అయితే ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అమెరికన్‌ సమోవాను చివరిదిగా పరిగణిస్తారు.