Sadhguru Save Soil: మట్టిని రక్షించాలంటూ 'Save Soil' పేరిట ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ చేప‌ట్టిన బైక్ యాత్ర విజ‌య‌వంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఉద్య‌మాన్ని మ‌ద్ద‌తుగా.. దుబాయిలోని బుర్జ్ ఖలీఫాలో విజ‌యోత్స‌వ‌ వేడుకలు జరిగాయి. ఈ సంద‌ర్బంగా బుర్జ్ ఖలీఫాపై లేజ‌ర్ షోను నిర్వ‌హించారు.

Sadhguru Save Soil: మట్టిని రక్షించాలంటూ ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ 'Save Soil' పేరిట ఓ ఉద్య‌మాన్నిచేప‌ట్టారు. ఈ ఉద్య‌మంలో భాగంగా భూసార పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆయ‌న 100 రోజుల పాటు 'Save Soil' పేరిట బైక్ ర్యాలీని నిర్వ‌హించారు. ఈ 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా దుబాయిలోని బుర్జ్ ఖలీఫాలో విజ‌యోత్స‌వ‌ వేడుకలు జరిగాయి.

Save Soil ఉద్యమానికి దుబాయ్ మద్దతు .

Save Soil ఉద్యమానికి మ‌న దేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఊహించని ప్ర‌తిస్పంద‌న వ‌చ్చింది. 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం)పై సద్గురు Save Soil గురించి లైట్& లేజర్ షో ను ఏర్పాటు చేశారు. 2 నిమిషాల పాటు సాగిన ఈ లేజర్ షోలో సద్గురు Save Soil సందేశంతో పాటు ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు, సెలబ్రిటీల మద్దతు ఆడియో-వీడియో క్లిప్‌లను ప్ర‌ద‌ర్శించారు. దీనితో పాటు.. లండన్ నుండి భారతదేశానికి సద్గురు చేసిన చారిత్రాత్మక మోటార్ సైకిల్ ప్రయాణం హైలెట్స్ ప్ర‌ద‌ర్శించారు. Save Soil ప్ర‌చార‌ ఉద్యమం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 27 దేశాల్లో 30 వేల కిలోమీటర్లకు పైగా సాగింది.

ప్ర‌చార యాత్రకు 100 రోజులు పూర్తి 

సద్గురు Save Soil బైక్ యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బుర్జ్ ఖలీఫాలో వేడుకలు జరిగాయి. ఈ కార్య్ర‌క్ర‌మంలో సద్గురు జగ్గీవాసుదేవ్ హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త‌న బైక్ ప్ర‌చార‌యాత్ర‌ గత 3 నెలలుగా సాగుతోంద‌నీ, ఈ ప్ర‌చార‌ యాత్రలో దాదాపు 3.9 బిలియన్ల మంది ప్రజలను క‌లిసిన‌ట్టు తెలిపారు. 74 దేశాల మట్టి పునరుత్పత్తికి కృషి చేయడానికి అంగీకరించార‌నీ, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. సద్గురు నేల పునరుత్పత్తి పట్ల UAE ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రశంసించారు.

సద్గురు మాట్లాడుతూ.. “పని ఇప్పుడే ప్రారంభమైంది. విధానాలను అమలు చేయ‌డ‌మే అసలైన సవాలు. మట్టిని కాపాడుకోవడంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఈ ఉద్యమం.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మట్టి గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వాలు మట్టి పునరుత్పత్తి కార్యక్రమాలపై చర్చిస్తున్నాయ‌ని అన్నారు.

లైట్ షోను రఘు సుబ్రమణ్యం స్పాన్సర్

సద్గురు Save Soil బైక్ యాత్ర విజ‌య‌వంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. Actyv.ai వ్యవస్థాపకుడు, గ్లోబల్ CEO రఘు సుబ్రమణ్యం, అలాగే.. 1Digi ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఈ కార్యక్ర‌మానికి మ‌ద్ద‌తుగా.. బుర్జ్ ఖలీఫాలో లైట్ షోను స్పాన్సర్ చేశారు. పర్యావరణం, సామాజిక, పాలన (ESG) త‌న‌ వ్యాపారంలో ప్రధానమైనదని, సద్గురు ఇషా ఫౌండేషన్ నేతృత్వంలోని సేవ్ సాయిల్ ఉద్యమంతో తాను భాగ‌స్వామి అయినందుకు గర్వంగా ఉందని రఘు సుబ్రమణ్యం అన్నారు.

Save Soil కు UAE మద్దతు

సద్గురు Save Soil ప్రచారాన్ని UAE పర్యావరణ మంత్రి హెచ్.ఇ. మరియం బింట్ మొహమ్మద్ అల్మహేరి 
ప్ర‌శంసించారు. విలువైన మట్టిని కాపాడి.. రాబోయే తరాలకు సుర‌క్షితంగా ఇచ్చేందుకు చేస్తున్న కృషిలో
ఇది తొలి అడుగు అని ఆయన అభివ‌ర్ణించారు.

ప్రపంచ సంస్థల మద్దతు.. 

సేవ్ సాయిల్ ఉద్యమానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్‌మెంట్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ (UNCCD), యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP), యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) లు మద్దతుగా నిలిచాయి. మేలో.. సేవ్ సాయిల్ యాత్రకు యూఏఈ మ‌ద్ద‌తు తెలుపుతూ.. ఓ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
భూమిని, వ్యవసాయ నేలలను కాపాడేందుకు తక్షణ చట్టాన్ని రూపొందించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను సేవ్ ది సాయిల్ ఉద్యమం కోరుతోంది. ఇప్ప‌టికే 50% నేల‌లు క్షీణించాయ‌నీ, పంట‌ల దిగుబడి చాలా త‌గ్గింద‌ని ఉద్య‌మం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ వ్యవసాయ నేలల్లో 3-6% సేంద్రీయ ప‌దార్థాల‌ను తప్పనిసరి చేయాలని ఆయా దేశాలను కోరడం ఈ ఉద్యమ ప్ర‌ధాన‌ లక్ష్యం. మట్టిని సారవంతంగా ఉంచడానికి సేంద్రియ ఎరువుల‌ను ఉప‌యోగించాల‌ని కోరుతుంది.

సద్గురు Save Soil ఉద్యమం

సద్గురు Save Soil ప్ర‌చార కార్యక్ర‌మం మార్చి 21న లండన్‌లో ప్రారంభమైంది. ఈ ప్ర‌చార యాత్ర యూరప్, మధ్య ఆసియా, మధ్యప్రాచ్యంలోని 27 యూర‌ప్ దేశాల గుండా సాగింది. మే నెలలో ఐవరీ కోస్ట్‌లో జరిగిన ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ (UNCCD COP15)కి సంబంధించిన పార్టీల 15వ సెషన్‌లో సద్గురు ప్రసంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో 197 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 

అదే నెలలో.. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF)లో కూడా సద్గురు ప్రసంగించారు. UNCCD నివేదికల‌ ప్రకారం.. ప్రస్తుతం జ‌రుగుతున్న‌ నేల కోత రేటు ప్రకారం.. 2050 నాటికి భూమిలో 90% ఎడారిగా మారవచ్చ‌ని నివేదించాయి. ఇప్పటివరకు.. 74 దేశాలు భూమిని అంతరించిపోకుండా కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశాయి. అలాగే మ‌న‌దేశంలోని 8 రాష్ట్రాలు నేల పునరుత్పత్తికి కృషి చేయడానికి అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.