Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త దారుణ హత్య.. అధికారులు ఏమంటున్నారు?

రష్యా దేశ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన 47 ఏళ్ల ఆండ్రె బోతికొవ్ దారుణ హత్యకు గురయ్యారు. అతడిని బెల్ట్‌తో గొంతు నులిమి చంపేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

russian scientist who developed sputnik v corona vaccine murdered
Author
First Published Mar 4, 2023, 3:29 PM IST

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ప్రముఖులు హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా ఉన్నది. ఇటీవలే ఒడిశా రాష్ట్రంలో రష్యా రాజకీయ నేతల వరుస హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ దేశ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ అభివృద్ధిలో పాలుపంచుకున్న టాప్ సైంటిస్టు దారుణ హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. మాస్కోలోని ఆ సైంటిస్టు అపార్ట్‌మెంట్‌లో బెల్ట్‌తో గొంతు నులిమి చంపేశారు. ఆ సైంటిస్టు గురువారం తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవై కనిపించాడు.

47 ఏళ్ల రష్యన్ సైంటిస్టు ఆండ్రె బోతికొవ్ గమలేయ నేషనల్ రీససెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ, మ్యాథమేటిక్స్‌లో సీనియర్ రీసెర్చర్‌గా ఉన్నారు. అతను స్పుత్నిక్ వీ టీకా అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేయడంలో ఆయన పాత్రను గుర్తించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అతనికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్‌లాండ్ అవార్డును అందజేశారు. 2020లో స్పుత్నిక్ వీ అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల బృందంలో వైరాలజిస్ట్ ఆండ్రె బోతికొవ్ ఒకరు.

ఆండ్రె బోతికొవ్ మరణాన్ని హత్యగా దర్యాప్తు చేస్తున్నట్టు రష్యా తెలిపింది. 29 ఏళ్ల నిందితుడు బోతికొవ్‌ను బెల్ట్‌తో గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు. వాగ్వాదం తీవ్రస్థాయికి వెళ్లిన తర్వాత ఆ నిందితుడు బోతికొవ్‌ను హతమార్చినట్టు చెప్పారు. ఓ గొడవ కారణంగా ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నట్టు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తెలిపాయి.

Also Read: కొవిడ్ తరహా లక్షణాల తో దేశ వ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు.. నిపుణులు చెప్పే సలహాలు ఇవే

బోతికొవ్ డెడ్ బాడీ లభించిన గంటల వ్యవధిలోనే అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారని ఓ ప్రకటనలో వెల్లడించారు. స్వల్ప సమయంలోనే హంతకుడి లొకేషన్ పసిగట్టారని తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. దర్యాప్తులో ఆ నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు. ఆ నిందితుడికి నేర చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios