Russian Ukraine Crisis:రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి విదేశాల్లోని బ్యాంకులకు నగదు ట్రాన్స్‌ఫర్ చేయడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిషేధం విధించారు.
Russian Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా ఐదో రోజు కూడా దాడిని కొనసాగించింది. ఇప్పటికే పలు ప్రధాన నగరాలను రష్యా బలాగాలు ధ్వంసం చేశాయి. రష్యా దాష్టీకంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎటుచూసినా.. బాంబు దాడులు, క్షిపణుల ప్రయోగాలు, వైమానిక దాడులతో భయానక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో అక్కడ పౌరులు.. ప్రత్యేక్ష నరకాన్ని చూస్తున్నారు. ఎక్కడ ఆశ్రయం దొరికితే.. అక్కడ తలదాచుకుంటున్నారు.
ఇప్పటికే రష్యా దుశ్చర్యను ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు తప్పు పట్టాయి. యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని ఐక్య రాజ్యసమితి కూడా కోరింది. రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. రష్యా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, కఠినమవుతున్న ఆర్థికాంక్షలు, తమ విమానాలకు గగనతల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి విదేశాల్లోని బ్యాంకులకు నగదు ట్రాన్స్‌ఫర్ చేయడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిషేధం విధించారు. ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ తగిలేలా బ్రిటన్, అమెరికా తదితర దేశాలు.. రష్యా బ్యాంకులను స్విఫ్ట్ సేవల నుంచి బహిష్కరించాయి. ఈ చర్యకు ప్రతీకారంగా, రష్యన్లు విదేశాలకు నగదు బదిలీ చేయకుండా పుతిన్ ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తుంది.
రష్యా, రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ సేవలనుంచి బహిష్కరించాలని యూరోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్న నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం సారధ్యం వహించింది. అంతర్జాతీయ చెల్లింపులకు స్విఫ్ట్ ఒక విధానంగా పని చేస్తుంది. అయితే, ఈ స్విఫ్ట్ విధానాన్ని నిలిపివేయడం ద్వారా చెల్లింపులు చేయాల్సిన సంస్థలు, ఆర్ధిక సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. స్విఫ్ట్ నుంచి రష్యాను బ్యాన్ చేయడం వల్ల ఆ దేశ కరెన్సీ పతనమవుతోంది. ప్రస్తుతం అమెరికా డాలర్‌తో పోలిస్తే రష్యా కరెన్సీ రబుల్ 30 శాతానికి దిగజారింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ రష్యా వడ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది.
దేశ కరెన్సీ మరింత పతనం కాకుండా.. రష్యా ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ రష్యాతో బ్రిటన్, అమెరికా, ఈయూ దేశాల బ్యాంకులు సంబంధాలు తెంచుకోవడంతో రబుల్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత్‌తోపాటు 200కి పైగా దేశాల్లో స్విఫ్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల బ్యాంకులకు స్విఫ్ట్ సేవలు లభిస్తున్నాయి. స్విఫ్ట్ సేవలతో అంతర్జాతీయ ఆర్థిక సేవలు చాలా సులభంగా కొనసాగుతున్నాయి.
