కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్న, పెద్ద, ధనిక పేద అన్న తేడా లేకుండా అందరికి సోకుతుంది. కెనడా ప్రధాని భార్యకు కరోనా సోకిందన్న విషయం గురించి ప్రపంచం చర్చించుకుంటుండగానే.... బ్రిటన్ ప్రధానికి కరోనా సోకిందన్న విషయం అందరినీ ఒకసారిగా షాక్ కు గురి చేసింది. 

ఇప్పుడు తాజాగా రష్యా ప్రధాని ఈ కరోనా వైరస్ బారిన పడ్డాడు. రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తీన్ నిన్న గురువారం రోజున తనకు కరోనా వైరస్ సోకినట్టు తెలిపాడు. అధ్యక్షుడు పుతిన్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో డాక్టర్ల సలహా మేరకు తన వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు,ఐసొలేషన్ లో ఉంటున్నట్టు తెలిపాడు. తాను తిరిగొచ్చే వరకు ఎవరినయినా  తాత్కాలిక ప్రధానిని నియమించాలని కోరారు. 

ఆ వెంటనే పుతిన్ ఆండ్రి బెలుసోవ్ ను తాత్కాలిక ప్రధానిగా నియమించారు. అనూహ్యంగా ఈ జనవరిలో అధ్యక్షుడు పుతిన్ రష్యన్ కాబినెట్ ను రద్దు చేసి, మెద్వదేవ్ ను తొలిగించి మిషుస్తీన్ ను నియమించారు. 

ఇక కరోనా కేసులు రష్యాలో 1,00,0000 దాటాయి. అధ్యక్షుడు పుతిన్ మాత్రం అప్పుడెప్పుడో హాస్పిటల్ లో ఒక హజమత్ సూట్ వేసుకొని అక్కడ పరిస్థితులను సమీక్షించిన తరువాత ఇప్పటివరకు మరల కనబడలేదు. 

మొన్నటివరకు రష్యాలో కరోనా వైరస్ కేసులు తక్కువగా నమోదయినప్పటికీ... ఈ మధ్య కాలంలో కేసుల్లో విపరీతమైన పెరుగుదల కనబడుతుంది. అక్కడ నిన్నొక్కరోజే 7,000 పై చిలుకు కేసులు నమోదయ్యాయి. 

అక్కడి డాక్టర్లు సరైన రక్షణ పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని మాస్కో వెలుపల వైద్యుల పరిస్థితి మరి దయనీయంగా ఉంది. వారికి సరైన రక్షణ లేక చాలామంది డాక్టర్లు కూడా ఈ వైరస్ బారినపడి మరణించారు. 

ఇకపోతే... భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో కొత్తగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి చేరుకుంది. కొత్తగా గత 24 గంటల్లో 67 మంది మరణించారు. దీంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 1,074క చేరుకుంది. 

ఇప్పటి వరకు కోవిడ్ -19 రోగులు చికిత్స పొంది 8,325 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రికవరీ రేటు 25.18 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది. 

మహారాష్ట్రలోని మాలెగావ్ లో బుధవారం రాత్రి కొత్తగా 71 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాలెగావ్ లో 253కు చేరుకుంది. కరోనా వైరస్ సోకినవారిలో 3 నెలల బేబీ కూడా ఉంది. ఆరుగురు పోలీసులు ఉన్నారు.

ఇదిలావుంటే, వలస కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులకు కూడా ఊరట లభించింది. వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇరు రాష్ట్రాలు సంప్రదించుకుని వారిని అనుమతించాలని కేంద్రం స్పష్టం చేసింది.