Alexei Navalny : రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవల్నీ జైలులో మృతి
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించినట్లు ఆ దేశ జైలు సర్వీస్ తెలిపింది. పుతిన్ అధికారంలో వుండగా తాను విడుదలవుతాననే ఆశ తనకు లేదని ఆయన గతంలో పేర్కొన్నారు.
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించినట్లు ఆ దేశ జైలు సర్వీస్ తెలిపింది. ఈ ఘటన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ముడిపడి వున్న రాజకీయ హత్యగా భావించబడుతోంది. నవల్నీ (47) పుతిన్‌ను నిత్యం విమర్శించే వ్యక్తుల్లో ఒకరు. అతనిని ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరాన 40 మైళ్ల దూరంలో వున్న జైలులో నిర్బంధించారు. ప్రత్యేక పాలన కింద 19 ఏళ్ల జైలు శిక్షను అలెక్సీ నవల్నీ అనుభవిస్తున్నారు.
డిసెంబర్ ప్రారంభంలో అలెక్సీ నవల్నీ వ్లాదిమిర్ ప్రాంతంలోని జైలు నుంచి అదృశ్యమయ్యాడు. అక్కడ తీవ్రవాదం , మోసం ఆరోపణలపై 30 ఏళ్ల జైలు శిక్షను ఆయన అనుభవిస్తున్నాడు. 2010లో క్రెమ్లిన్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు ప్రతీకారంగా పుతిన్ ఇది చేశాడని నవల్నీ పునరుద్ఘాటించారు. పుతిన్ అధికారంలో వుండగా తాను విడుదలవుతాననే ఆశ తనకు లేదని ఆయన గతంలో పేర్కొన్నారు.
జాతీయవాద రాజకీయవేత్త అయిన నవల్నీ.. రష్యాలో 2011-12 మధ్యకాలంలో నిరసనలను ఉత్ప్రేరకపరచడంలో కీలకపాత్ర పోషించారు. ఎన్నికల్లో మోసం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. మిలియన్ల కొద్ది వీక్షణలను సంపాదించిన ఆకర్షణీయమైన వీడియోల ద్వారా నవల్నీ ప్రచారం చేశాడు. 2013లో మాస్కో మేయర్ ఎన్నికల్లో ఆయన 27 శాతం ఓట్లను సాధించినప్పుడు రాజకీయంగా నవల్నీ ఎంతో ఎత్తుకు చేరుకున్నారు.
న్యాయం, పారదర్శకత లోపించిందని ఆయన విస్తృతంగా విమర్శించారు. క్రెమ్లిన్ నుంచి నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ.. నవల్నీ మాత్రం పుతిన్ అవినీతిని బహిర్గతం చేస్తూనే వున్నాడు. పుతిన్‌తో ముడిపడి వున్న నల్ల సముద్రపు ప్యాలెస్, మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ విలాసవంతమైన ఆస్తులు, విదేశాంగ శాఖలోని ఉన్నత స్థాయి అధికారి , ఓ పాలకుడి మధ్య సంబంధాల గురించి వివరాలను ఆయన వెలికి తీశారు.
2020లో రష్యాకు చెందిన ఎఫ్‌ఎస్‌బీ భద్రతా సేవ ద్వారా నోవిచోక్ విషప్రయోగం జరిగినట్లు అనుమానించబడిన నవల్నీ కోమాలోకి జారుకోవడంతో అతని జీవితం నాటకీయ మలుపు తిరిగింది. జర్మనీలో చికిత్స పొందిన తర్వాత, కోలుకున్న ఆయన 2021లో రష్యాకు తిరిగి వచ్చాడు. పెరోల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తక్షణమే అరెస్ట్ అయ్యాడు. తదనంతరం అనేక జైలు శిక్షలను ఎదుర్కొన్న నవల్నీ మొత్తంగా 30 ఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించాడు. ప్రస్తుతం ఐదోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్.. జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా అధినేతగా కొనసాగుతున్నారు. 2020లో సవరించిన రాజ్యాంగ కాలపరిమితి నియమాలతో , పుతిన్ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ 2030కి మించి తన అధ్యక్ష పదవిని పొడిగించవచ్చు.