ఉక్రెయిన్ పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. ఆ దేశ వ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాలపై శనివారం రష్యా క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ లోని డ్నిప్రో నగరంలో 12 మంది పౌరులు మరణించారు. 

ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ భారీ దాడులను ప్రారంభించింది. ఈ సారి ఆ దేశ వ్యాప్తంగా ఉన్న ఇంధన మౌలిక సదుపాయాలను టార్గెట్ గా చేసుకుంది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు కూడా చనిపోయారు. రష్యా ప్రయోగించిన క్షిపణి డ్నిప్రో నగరంలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 12 మంది మరణించారు.

మధ్య ప్రదేశ్ లో అమానుషం... 90 ఏళ్ల వృద్దురాలిపై కామాంధుడి అత్యాచారం

ఈ దాడిలో అపార్ట్మెంట్ కుప్పకూలింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోయి, విపరీతమైన చలి వణికిస్తున్నా కూడా రాత్రి పూట సహాయక చర్యలను కొనసాగించారు. అయితే ఇంకా పలువురు ఆ శిథిలాల కింద సజీవంగా ఉన్నారని స్థానిక అధికారులు వెల్లడించినట్టు ‘రాయిటర్స్’ నివేదించింది. ఈ ఘటనపై డ్నిప్రో డిప్యూటీ మేయర్ మిఖైలో లైసెంకో సోషల్ మీడియా వీడియోలో మాట్లాడుతూ.. శిథిలాల కింద ఉన్న వారు ఎస్ఎంఎస్ లు పంపిస్తున్నారని అన్నారు. వారి అరుపులు వినబడేందుకు వీలుగా అప్పుడప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ను నిలిపివేస్తున్నామని చెప్పారు.

ఈ దాడి వల్ల కుప్పకూలిన అపార్టెమెంట్ ఫొటోలను, సహాయక చర్యలను డ్నిప్రో మేయర్ బోరిస్ ఫిలాటోవ్ టెలిగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు, భారీ లోహాలను, కాంక్రీట్ దిబ్బలను తొలగించేందుకు యంత్రాలతో కూబింగ్ చేస్తున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు స్ట్రెచర్లను ఉపయోగించడం కూడా కనిపిస్తోంది.

గ్వాటెమాల అడవి అడుగున 2000 ఏళ్ల పురాతన మయా నగరం.. పరిశోధకుల అధ్యయనంలో వెలికి

రష్యా క్షిపణులు కైవ్, ఇతర నగరాల్లో ఉన్న మౌలిక సదుపాయాలను కూడా టార్గెట్ గా చేసుకొని దాడులు కొనసాగించాయి. అయితే ఈ దాడుల వల్ల ఈ శీతాకాలంలో విద్యుత్తు, నీటి సరఫరా వంటి సౌకర్యాలకు ఇబ్బందులు వస్తాయని ఉక్రెయిన్ ఇంధన మంత్రి అన్నారు. కాగా.. డ్నిప్రో అపార్ట్ మెంట్ బాంబు దాడిలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. రష్యా ఉగ్రవాదం, పౌర లక్ష్యాలపై దాడులను ఎదుర్కొనేందుకు మరిన్ని ఆయుధాలు కావాలని తన పాశ్చాత్య భాగస్వాములను కోరినట్టు పేర్కొన్నారు. అయితే రష్యా దాడులను అమెరికా రాయబారి బ్రిడ్జెట్ బ్రింక్, కైవ్ ఇతర మిత్రదేశాలు తప్పుబట్టాయి.

త్వరలో రాజకీయ వారసుడిని ప్రకటించనున్న పుతిన్ .. అధ్యక్ష పీఠాన్ని త్యజించనున్నారా?

ఇదిలా ఉండగా.. గత నెల చివరల్లో కూడా ఇలాగే ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని 120 కంటే ఎక్కువ క్షిపణులను రష్యా ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, తూర్పున ఉన్న ఖార్కివ్, పోలాండ్ సరిహద్దులోని పశ్చిమ నగరం ఎల్వివ్‌తో సహా దేశమంతటా ఉన్న మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగించాయి. రాజధాని కీవ్‌లో‌ సంభవించిన పేలుళ్ల కారణంగా కనీసం ముగ్గురు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించినట్టుగా మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. వారిలో ఒక 14 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్టుగా చెప్పారు. రాజధాని కీవ్ తూర్పున క్షిపణుల నుండి వచ్చిన శిధిలాల వల్ల రెండు గృహాలు దెబ్బతిన్నాయి. నైరుతి ప్రాంతంలో ఒక పారిశ్రామిక సంస్థ, ఆట స్థలం దెబ్బతిన్నాయి.