Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు నైరుతి దిశలో ఉన్న నగరంలోని కార్యాలయ భవనాన్ని మూడు ర‌ష్య‌న్ క్షిపణులు ఢీకొన్నాయనీ, దీంతో సమీపంలోని నివాస భవనాలు ధ్వంసమ‌య్యాయ‌ని అక్క‌డి అధికారులు తెలిపారు.  

Russian missile strikes Ukrainian: ఉక్రెయిన్-ర‌ష్యాల మ‌ధ్య వార్ కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. రెండు దేశాల మ‌ధ్య జ‌రిగిన శాంతి చ‌ర్చ‌లు ఫ‌లించ‌లేదు. వెన‌క్కిత‌గ్గ‌ని ర‌ష్యా దూకుడుగా ఉక్రెయిన్ పై దాడిని కొన‌సాగిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి ర‌ష్యాన్ క్షిప‌ణులు ఉక్రెయిన్ పై విరుచుకుప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో పెద్ద మొత్తం ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభించిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

రష్యా క్షిపణులు గురువారం విన్నిట్సియా నగరంపై విరుచుకుప‌డ్డాయి. ఈ దాడిలో ఏకంగా 12 మంది మరణించారు. మ‌రో 25 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని ఆ దేశ మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడుతూ.. సైనికులు లేని ప్రాంతాల్లో దాడులు చేస్తూ.. సామాన్య పౌరుల ప్రాణాలు తీస్తున్న ఈ ర‌ష్యా క్షిప‌ణీదాడుల‌ను బహిరంగ ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. రాజధాని కైవ్‌కు నైరుతి దిశలో ఉన్న నగరంలోని కార్యాలయ భవనాన్ని మూడు క్షిపణులు ఢీకొన్నాయని అక్క‌డి పోలీసులు తెలిపారు. దీంతో సమీపంలోని నివాస భవనాలను ధ్వంసం అయ్యాయ‌ని అన్నారు. క్షిపణి దాడితో పెద్ద‌మొత్తంలో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న పార్కింగ్‌లో 50 కార్లు దగ్ధమయ్యాయ‌ని తెలిపారు. 

ఈ దాడిలో ఇప్ప‌టివ‌ర‌కు 12 మంది చ‌నిపోగా.. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. పౌరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని ఆయ‌న పేర్కొన్నారు. “ప్రతిరోజు రష్యా త‌మ‌ పౌర జనాభాను నాశనం చేస్తోంది.. ఉక్రేనియన్ పిల్లలను చంపుతోంది. పౌర ఆస్తుల‌పై క్షిపణులను ప్ర‌యోగిస్తోంది. మిలిటరీ (లక్ష్యాలు) లేని చోట ఇలా దాడులు చేయ‌డం బహిరంగ ఉగ్రవాద చర్య కాకపోతే ఏమిటి? అంటూ వోలోడిమిర్ జెలెన్స్కీ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అలాగే, అంత‌కు ముందు ర‌ష్యా దాడులో ఐదుగురు పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. అలాగే, మ‌రో ఎనిమిది మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్ల‌డించింది. 

ఇదిలావుండ‌గా, ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించిందని జీ20 మంత్రులు ఇండోనేషియాలో చర్చలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్ గురువారం అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి నుండి కోలుకోవడానికి ప్రపంచం కష్టపడుతున్న సమయంలో ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కార‌ణంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింద‌న్నారు. గత రెండు సంవత్సరాల లాభాలను ప్రమాదంలో పడేస్తుంది..విస్తృతమైన ఆకలి, పేదరికాన్ని పెంచుతోంద‌ని అన్నారు.

"ప్రపంచంలోని ప్రతి మూలలో ఆ యుద్ధం నుండి ప్రతికూల స్పిల్‌ఓవర్ ప్రభావాలను మేము చూస్తున్నాము. ప్రత్యేకించి అధిక ఇంధన ధరలు, పెరుగుతున్న ఆహార అభద్రతకు సంబంధించిన విషయాలు ఆందోళనను పెంచుతున్నాయి" అని అన్నారు. "అంతర్జాతీయ సమాజం తన యుద్ధం ప్రపంచ ఆర్థిక, మానవతా పరిణామాలకు పుతిన్‌ను జవాబుదారీగా ఉంచడం గురించి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని" అన్నారు.