రష్యా విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు.. ఫ్లైట్‌లో 300 మంది ప్రయాణికులు (వీడియో)
థాయ్‌లాండ్‌లో రష్యా విమానం టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు వ్యాపించాయి. టైర్, ఇంజిన్‌లో మంటలు రావడంతో అవి రెక్కల ద్వారా బయటకు కనిపించాయి. అప్పుడు విమానంలో 300 మంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

న్యూఢిల్లీ: రష్యా విమానం టేకాఫ్ అవుతుంగా దాని టైర్లు, రెక్కల్లో మంటలు వచ్చాయి. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు విమానంలో సిబ్బంది సహా 300 మంది ఉన్నారు.
రష్యాకు చెందిన ఆజుర్ ఎయిర్ అనే ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం 12 మంది సిబ్బంది సహా 300 మందితో టేకాఫ్ అవుతుండగా ఫ్లైట్ టైర్లు, ఇంజిన్‌లలో మంటలు వ్యాపించాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన ఫిబ్రవరి 4వ తేదీన జరిగిందని ఓ యూజర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆ ఫ్లైట్ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయల్దేరిందని వివరించారు.
రష్యాకు చెందిన ఆజుర్ ఎయిర్ బోయింగ్ 767-300ER అనే విమానం ఫుకెట్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగిందని ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. దీంతో థాయ్ ఎయిర్‌పోర్టు శనివారం సాయంత్రం 4.30 గంటటల నుంచి ఆదివాం ఉదయం వరకు అన్ని ఫ్లైట్‌లను క్యాన్సిల్ చేసిందని ఆ యూజర్ తెలిపారు. అంతేకాదు, రష్యా విమానసంస్థలకు చెందిన విమానాలను రానివ్వకుండా నిర్ణయం తీసుకునే సమయం అన్ని దేశాలకు ఆసన్నమైందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఆజుర్ ఎయిర్ ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. ఎయిర్‌లైన్ టెక్నికల్ స్పెషలిస్టులు ఈ లోపాన్ని సరిదిద్దడానికి ఇప్పటికే పనిలో దిగిపోయారని పేర్కొంది.