త్వరలోనే క్యాన్సర్ వ్యాక్సిన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ వ్యాక్సిన్ కు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గుడ్ న్యూస్ చెప్పారు.
మాస్కో: క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు పరిశోధలను చేస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఈ పరిశోధనలు పురోగతిలో ఉన్నాయన్నారు. క్యాన్సర్ వ్యాక్సిన్ త్వరలోనే రోగులకు అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తం చేశారు.
మేం కొత్త తరం కోసం క్యాన్సర్ వ్యాక్సిన్ లు, ఇమ్యునోమోడ్యులేటరీ డ్రగ్స్ తయారీ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలు దాదాపుగా పూర్తి కావొచ్చినట్టుగా పుతిన్ బుధవారం నాడు చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్ లు ఏ రకమైన క్యాన్సర్ లక్ష్యంగా పనిచేస్తాయనే విషయాన్ని పుతిన్ చెప్పలేదు. అనేక దేశాలు, కంపెనీలు క్యాన్సర్ వ్యాక్సిన్ లపై పనిచేస్తున్నాయి.
గత ఏడాది యూకే ప్రభుత్వం 2023 నాటికి 10 వేల మంది రోగులకు వ్యక్తిగత క్యాన్సర్ చికిత్సలను అందించే క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించేందుకు జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఫార్మాసూటికల్ కంపెనీలు మోడెర్నా, మెర్క్ అండ్ కో కంపెనీలు ప్రయోగాత్మక క్యాన్సర్ వ్యాక్సిన్ ను అభివృద్ది చేస్తున్నాయి. మూడేళ్ల చికిత్స తర్వాత అత్యంత ప్రాణాంతక చర్మ క్యాన్సర్ నుండి రక్షించవచ్చని మెలనోమా అధ్యయనాలు చెబుతున్నాయి.
గర్భాశయ క్యాన్సర్ తో పాటు అనేక క్యాన్సర్లకు కారణమయ్యే హ్యుమన్ పాపిల్లోమావైరస్ లకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఆరు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. అలాగే కాలేయ క్యాన్సర్ కు దారితీసే హెపటైటిస్ బీ (హెచ్‌బీవీ) నివారణకు కూడ టీకాలున్నాయి.
కరోనా సమయంలో కూడ రష్యా దేశం స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ను ప్రపంచంలోని పలు దేశాలకు విక్రయించారు. అయితే ఈ వ్యాక్సిన్ పై ఆ దేశ ప్రజలు కొంత అయిష్టతను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే స్పుత్నిక్ సమర్ధత, భద్రత గురించి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు గాను పుతిన్ స్వయంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.