Russia Ukraine Crisis: త‌గ్గేదేలే అన్న‌ట్టు ఉక్రెయిన్ కూడా ప్ర‌తిదాడికి దిగింది. ఈ యుద్ధంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టరును కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలటరీ ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఆ దేశ మిలటరీ గురువారం తెలిపింది. 

Russia Ukraine Crisis: అంద‌రూ భయపడినట్టే.. ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం మొదలైంది. ర‌ష్యా వ్యూహాత్మ‌కంగా ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి దిగింది. ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలను టార్గెట్ చేసుకుని.. రష్యా దాడి చేస్తుంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్ కేపిటల్‌ కీవ్‌తోపాటు 20కి పైగా నగరాలపై బాంబుల దాడి చేస్తున‌ట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో గంట‌కో న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ర‌ష్యా తొలుత ఉక్రెయిన్ సైనిక స్థావరాల‌పై దాడి చేసింది. అనంత‌రం నివాస ప్రాంతం దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 300 మంది చ‌నిపోయిన‌ట్టు ఉగ్రెయిన్ తెలిపింది. 

ఈ త‌రుణంలో ఏ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టు ఉక్రెయిన్ కూడా ప్ర‌తిదాడికి దిగింది. ఉక్రెయిన్ కు అండ‌గా.. నాటో దేశాలు నిలిచాయి. ఉక్రెయిన్ ప్ర‌తి దాడిలో ఐదు రష్యన్ యుద్ద‌ విమానాలు, ఒక రష్యన్ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలటరీ ప్రకటించింది. 

ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఆ దేశ మిలటరీ వార్తా సంస్థ రాయిటర్స్ కు గురువారం తెలిపింది. పొరుగున ఉన్న బెలారస్ నుండి రష్యా సైన్యం త‌మ దేశంపై దాడి చేసిందని ఉక్రెయిన్ సరిహద్దు గార్డు ఏజెన్సీ తెలిపింది. ర‌ష్యాకు మద్ద‌తుగా బెలారస్ నిలిచింద‌ని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా గుర్తించిన ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లో లుహాన్స్క్ ఒకటి.

ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు జరుపుతున్నారని, ప్రాణనష్టం గురించి తక్షణ నివేదిక లేదని వారు తెలిపారు. రష్యా దళాలు దాని మిత్రదేశమైన బెలారస్‌కు సైనిక కసరత్తుల కోసం మోహరించాయనీ, ఈ చర్య ఉక్రెయిన్‌పై దాడికి నాందిగా భావించింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ బెలారస్ సరిహద్దుకు దక్షిణంగా 75 కిమీ (50 మైళ్ళు) దూరంలో ఉంది. ఉక్రెయిన్ ప్ర‌స్తుతం సైనిక పాల‌న‌లోకి వెళ్లిన‌ట్టు ఆ దేశ అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ దేశంపై తాము సైనిక చర్య ప్రారంభించినట్లు రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ ప్రకటించగానే పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ఈ క్ర‌మంలో తొలుత ఉక్రెయిన్ ఎయిర్ బేస్ లను, ఎయిర్ డిఫెన్స్ లను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. యుద్ధాన్ని ఆపండని రష్యాకు విజ్ఞప్తి చేసింది. ర‌ష్యా చ‌ర్చ‌ను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఖండించారు. రష్యా దూకుడుకు ప్రతిస్పందించడానికి నాటో మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటామని జో బిడెన్ చెప్పారు.