భారత్ మొదటి నుంచి ఉక్రెయిన్, రష్యాకు మధ్య యుద్ధం ముగిసిపోవాలని, సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. అటు ఉక్రెయిన్ కు గానీ, అటు రష్యాకు గానీ మద్దతు తెలపడం లేదు. తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. అయితే రష్యా నుంచి దూరంగా ఉండాలని, స్పష్టమైన వైఖరిని కలిగి ఉండాలని భారత్ కు అమెరికా సూచించింది.
ఉక్రెయిన్ (Ukraine)కు రష్యా (Russia)కు మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు వైపులా ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. అయితే యుద్దాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఐక్యరాజ్యసమితి చెప్పినా కూడా రష్యా వినడం లేదు. దీంతో వార్ ఎప్పుడు ముగిసిపోతుందో అర్థం కావడం లేదు.
ఉక్రెయిన్ పై దాడిని ఆపాలని భారత్ చేసిన విజ్ఞప్తిని కూడా పుతిన్ (putin) పట్టించుకోలేదు. భారత్ కు రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే అమెరికా (america)తో కూడా మన దేశం స్నేహపూర్వకంగా నడుచుకుంటోంది. మన విదేశాంగ విధానం వల్ల రెండు దేశాలతోనూ మంచి రిలేషన్స్ మెయింటెన్ చేస్తోంది. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు ఇస్తోంది. అయితే ఈ యుద్ధంలో భారత్ ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. అలాగని ఎవరినీ బహిరంగంగా విమర్శించడం లేదు. భారత్ శాంతిని కోరుకుంటోంది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా ఇండియా (india)కు తీసుకొచ్చేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది.
కాగా.. భారత్ అవలంభిస్తున్న తటస్థ విధానం అమెరికాకు నచ్చడం లేదు. రష్యా తీరును ఖండిస్తూ అమెరికా యూఎన్ భద్రతా మండలి సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మాణానికి, అలాగే యూఎన్ జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా ప్రవేశపెట్టాలనే తీర్మాణానికి, జనరల్ అసెంబ్లీలో తీర్మాణానికి భారత్ దూరంగా ఉంది. అటు అనుకూలంగా గానీ, ఇటు వ్యతిరేకంగా గానీ ఓటు వేయలేదు. అయితే ఈ తీరే ఇప్పుడు అమెరికాకు కోపం తెప్పిస్తోంది. ఏదైనా ఒక స్ఫష్టమైన వైఖరి తీసుకోవాలని సూచించింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైన నాటి నుంచి ఇటు ఉక్రెయిన్ కు సపోర్ట్ చేయకుండా, రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడని ఏకైక యూఎస్ మిత్ర దేశం భారతదేశం. అయితే బిడెన్ పరిపాలన విభాగం ఈ విషయంలో భారత్ కు ఓ సూచన చేసింది. రష్యాకు దూరంగా ఉండాలని తేల్చి చెప్పింది. “ నేను చెప్పగలిగేది ఏమిటంటే, భారతదేశం ఇప్పుడు మనకు చాలా ముఖ్యమైన భద్రతా భాగస్వామి. మేము ఆ భాగస్వామ్యానికి విలువనిస్తాము. రష్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. భారతదేశం ఇప్పుడు రష్యా నుండి మరింత దూరం కావడానికి సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను” అని దక్షిణాసియా వ్యవహారాల సహాయ సంయుక్త కార్యదర్శి డొనాల్డ్ లూ (Donald Lu) సెనేట్ సబ్‌కమిటీ (Senate subcommittee)తో అన్నారు. రష్యా దండయాత్రను సమిష్టిగా ఖండిచాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పేందుకు అమెరికా అధికారులు భారత్‌తో చర్చలు జరిపారని ఆయన తెలిపారు.
క్వాడ్ వర్చువల్ సమావేశం గురువారం జరిగింది. అయితే ఈ సమావేశానికి ముందు బిడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన సమాచారం వేడిని మరింత పెంచింది. ‘‘ సాకులు లేదా అసమానతలకు స్థలం లేదు ’’ అని తెలిపింది. క్వాడ్ లో సభ్యులుగా ఉన్నజపాన్, ఆస్ట్రేలియాలు అమెరికాకు బహిరంగంగా మద్దతు తెలిపాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై ఐక్యరాజ్యసమితి చర్చలకు ఇండియా మూడుసార్లు గైర్హాజరైన తరువాత బిడెన్ పరిపాలన విభాగం భారత్‌ను స్పష్టమైన వైఖరిని తీసుకోవడానికి కృషి చేయాలని తెలిపింది.
