రష్యా ఉక్రెయిన్ దేశాలు పరస్పరం దాడులు ముమ్మరం చేసుకుంటున్నాయి. వైమానిక దాడులు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని కనీసం రెండు విమానాశ్రయాలపై రష్యా దాడులు జరిపింది. కాగా, 50 మంది రష్యా జవాన్లు తమ దాడిలో మరణించినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. అంతేకాదు, ఓ ప్రాంతాన్నీ తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు వివరించింది.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో సైనికీకరణ, నాజీకరణకు అడ్డుకట్ట వేయడానికి తాము ఉక్రెయిన్‌పై దాడి చేయకతప్పడం లేదని రష్యా(Russia) ఓ ప్రకటనలో వెల్లడించింది. అనంతరం ఉక్రెయిన్‌పై దాడులు(Attack) ప్రారంభించింది ఈ రోజు ఉదయమే ఉక్రెయిన్‌లోని కొన్ని కీలక ప్రాంతాల్లో బాంబులు, క్షిపణుల ద్వారా దాడులు జరిగాయి. ఉక్రెయిన్‌లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. కానీ, ఉక్రెయిన్ ప్రభుత్వం.. రష్యా ప్రకటనను కొట్టిపారేసింది. తమ ఎయిర్ డిఫెన్స్ సేఫ్‌గా ఉన్నదని, వాటిని ధ్వంసం చేశామని రష్యా అబద్ధాలు చెబుతున్నదని వివరించింది. 

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ మరో ప్రకటనలో తామే 50 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని తెలిపింది. అంతేకాదు, మరో రష్యా విమానాన్ని కూడా ధ్వంసం చేశామని వివరించింది. శ్చాస్త్య రీజియన్‌ను ఉక్రెయిన్ తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు పేర్కొంది. క్రమాటోర్స్క్ రీజియన్‌లో ఇప్పటికే తాము ఐదు రష్యా విమానాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. తాజా దాడిలో ఆరో విమానాన్నికూడా నాశనం చేశామని వివరించింది. కాగా, రష్యా జరిపిన షెల్లింగ్ దాడుల్లో ఏడుగురు తమ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పేర్కంది. కాగా, మరో తొమ్మిది మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది.

కాగా, రష్యా దాడులను మరింత పెంచుతున్నది. ఇప్పటికే కనీసం ఉక్రెయిన్‌లోని రెండు ఎయిర్‌పోర్టులపై రష్యా దాడులు జరిపింది. ఇవానో- ప్రాంకివ్‌స్క్‌లోని ఎయిర్‌పోర్టుపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఓ న్యూస్ చానెల్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాగా, తూర్పు ఉక్రెయిన్ దొనెత్స్క్ రీజియన్‌లోని రెండో అతిపెద్ద నగరం మరియుపోల్‌లో ఓ విమానాశ్రయం ఉన్నది. దీనిపైనా రష్యా దాడి చేసింది.

ఇదిలా ఉండగా, బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో కీలక ప్రకటన చేశారు. తాము ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌నుు చుట్టుముట్టే వ్యూహంలో రష్యా ప్రభుత్వం తమ బలగాలను మిలిటరీ డ్రిల్ పేరుతో బెలారస్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఈ దాడి చుట్టూ అంతర్జాతీయంగా రాజకీయాలు జరగడం, పశ్చిమ దేశాలు సయోధ్య కోసం ప్రయత్నించడం వంటి కార్యకలాపాలతో ఈ దాడులు ఆలస్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో బెలారస్‌లో తమ మిలిటరీ డ్రిల్‌ను మరో వారంపాటు పెంచుతున్నామని రష్యా ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది.

ఇదిలా ఉండగా, చైనా మాత్రం రష్యాకు మద్దతుగా నిలిచినట్టు తెలుస్తున్నది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్ రెగ్యులర్ డైలీ బ్రీఫింగ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓ విలేకరి ఆ అధికారి ముందు ప్రశ్నను నిలబెట్టాడు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమించడం గురించి.. అంటూ ప్రశ్న సంధించాడు. కానీ, చైనా చాలా జాగ్రత్త వహిస్తూ తమ వైఖరిని వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై సంయమనం పాటించాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియాంగ్ హితవు పలికారు. రష్యా చర్యలను దురాక్రమణగా వర్ణించరాదని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడి చేయడం వెనుక ప్రధాన కారణం నాటో కూటమి కనిపిస్తున్నది. ఈ దాడికి పూర్వం గతేడాది డిసెంబర్‌లోనే రష్యా పశ్చిమ దేశాలకు తమ డిమాండ్లు పంపింది. నాటో కూటమిలోకి ఉక్రెయిన్ దేశాన్ని ఎప్పటికీ చేర్చుకోబోమన్న హామీ ఇవ్వాలని, అలాగే, తూర్పు ఐరోపా వైపు నాటో విస్తరణ ఆపేయాలని రష్యా డిమాండ్ చేసింది. పశ్చిమ దేశాల హెచ్చరికలు అన్నింటినీ ఖాతరు చేయలేదు.