Asianet News TeluguAsianet News Telugu

నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రేపు అధికారికంగా తమలో కలుపుకోనున్న రష్యా

ఉక్రెయిన్‌లోని మరో నాలుగు భాగాలను రష్యా అధికారికంగా కలిపేసుకోనుంది. రేపు ఇందుకు సంబంధించిన సంతకాల కార్యక్రమం క్రెమ్లిన్‌లో నిర్వహించబోతున్నట్టు రష్యా అధికారికంగా వెల్లడించింది. లుగాన్స్క్, దొనెత్స్క్, ఖెర్సాన్, జపోరిఝియాలను రష్యా మిలిటరీ తన అధీనంలో ఉంచుకున్నది.
 

russia to official annex four ukraine territories tomorrow
Author
First Published Sep 29, 2022, 6:08 PM IST

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి నెల నుంచి ‘మిలిటరీ ఆపరేషన్’ చేపడుతున్నది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలు లుగాన్స్క్, దొనెత్స్క్, ఖెర్సాన్, జపోరిఝియాలను రష్యా తన మిలిటరీ అధీనంలోకి తెచ్చుకుని ఇప్పటికీ పట్టు నిలుపుకుని ఉన్నది. తాజాగా, ఈ నాలుగు ప్రాంతాలను రష్యాలో అధికారికంగా కలుపుకునే కార్యాన్ని నిర్వహించనుంది. రేపు గ్రేట్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో 12.00జీఎంటీ సమయంలో ఈ ప్రాంతాలను తమలో చేర్చుకున్నట్టు సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని రష్యా అధికారికంగా వెల్లడించింది.

ఈ రోజు విలేకరులతో రష్యా  అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్ విలేకరులతో మాట్లాడారు. ‘రేపు గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లోని జార్జియన్ హాల్‌లో సమయం 15.00 (12.00 జీఎంటీ)కు సంతకాల కార్యక్రమం ఉంటుంది. కొత్త భూభాగాలను రష్యాలో కలుపుకోవడానికి ఈ సంతకాలు జరగనున్నాయి’ అని వివరించారు. అంతేకాదు, ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన ప్రసంగాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఈ నాలుగు ప్రాంతాల్లో రష్యా చెబుతున్నట్టు రెఫరెండం నిర్వహించారు. రష్యా ఎంచుకున్న అధికారుల నియంత్రణలో సాగిన ఈ రెఫరెండంలో అక్కడి ప్రజలు రష్యాలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్టు ఈ వారంలోనే వెల్లడించింది. ఈ నాలుగు ప్రాంతాల నేతలు ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో ఉన్నారు. వీరంతా ప్రెసిడెంట్ పుతిన్‌తో సమావేశానికి ఎదురుచూస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇది వరకే ఉక్రెయిన్‌లోని క్రిమియాను రష్యా ఆక్రమించిన సంగతి తెలిసిందే. క్రిమియాను ఆక్రమించిన ఎనిమిదేళ్ల తర్వాత తాజాగా రష్యా మరో నాలుగు భూభాగాలను తనలో కలిపేసుకుంటుండటం గమనార్హం.

కాగా, ఈ కార్యక్రమాన్ని పశ్చిమ దేశాలు వ్యతిరేకించాయి. ఇటు వైపుగా అడుగులు వేయవద్దని రష్యాను కోరాయి. అంతేకాదు, ఈ నిర్ణయాలను తాము గుర్తించబోమని జీ7 వేదికగా అవి ప్రకటించాయి. 

ఇందుకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ మాత్రం మరిన్ని ఆయుధాలు, సహాయం కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios