కూలిన రష్యా సైనిక విమానం.. అందులో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, ప్రమాదమా, కూల్చేశారా..?
65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో ప్రయాణిస్తున్న ఐఎల్ 76 సైనిక రవాణా విమానం ఉక్రెయిన్ సరిహద్దులోని పశ్చిమ బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయిందని రష్యా బుధవారం ప్రకటించింది. సోషల్ మీడియాలో ధృవీకరించబడని వీడియోలు బెల్గోరోడ్ ప్రాంతంలో ఒక పెద్ద విమానం కూలిపోయినట్లు చూపించాయి
65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో ప్రయాణిస్తున్న ఐఎల్ 76 సైనిక రవాణా విమానం ఉక్రెయిన్ సరిహద్దులోని పశ్చిమ బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయిందని రష్యా బుధవారం ప్రకటించింది. సోషల్ మీడియాలో ధృవీకరించబడని వీడియోలు బెల్గోరోడ్ ప్రాంతంలో ఒక పెద్ద విమానం కూలిపోయినట్లు చూపించాయి. మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు బెల్గోరోడ్ ప్రాంతంలో ఐఎల్ 76 విమానం కూలిపోయిందని మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఆర్ఐఏ నోవోస్టి వార్తాసంస్థ పేర్కొంది.
పట్టుబడిన 65 మంది ఉక్రేనియన్ ఆర్మీ సర్వీస్‌మెన్‌లను మార్పిడి కోసం విమానంలో బెల్గోరోడ్ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ విమానంలో ఆరుగురు సిబ్బంది, ముగ్గురు ఎస్కార్ట్‌లు వున్నారని తెలిపింది. ఏఎఫ్‌పీ రష్యా ప్రకటను వెంటనే ధృవీకరించలేకపోయింది, అలాగే ప్రయాణీకుల వివరాలు కూడా స్పష్టంగా తెలియాల్సి వుంది. రాజధానికి ఈశాన్యంలో కొరోచన్స్కీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. విచారణ బృందం , ఎమర్జెన్సీ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని పని మొదలుపెట్టాయని , తాను కూడా ఆ ప్రాంతానికి బయల్దేరినట్లు గ్లాడ్‌కోవ్ చెప్పారు.
మరోవైపు విమానం కూలిన ఘటనపై కీవ్ నుంచి స్పందన రాలేదు. అయితే స్థానిక మీడియా మాత్రం ఉక్రెయిన్ రక్షణ దళాలను ఉదహరిస్తూ, ఉక్రెయిన్ బలగాలు విమానాన్ని కూల్చివేశాయని, అందులో క్షిపణులు వున్నాయని పేర్కొంది.