ప్రపంచాన్ని తమ వస్తువులతో ముంచెత్తుతూ..వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్థలను ప్రమాదంలో పడేస్తున్న చైనా తాజాగా వివిధ దేశాల్లోని జీవరాశిని సంకటంలోకి నెట్టిస్తోంది. అసలు మ్యాటరేంటంటే.. గాడిద చర్మాన్ని కాచి తీసిన జిరుగు లాంటి పదార్థానికి చైనాలో ఫుల్ డిమాండ్ ఉంది.. దీన్ని చర్మ సౌందర్యాన్ని పెంచే సంప్రదాయ ఔషధాలలో వాడుతారు. అంతేకాకుండా ఆహార ప్రియులైన చైనీయులు గాడిద మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

వీటన్నింటి దృష్ట్యా ఆ దేశంలో గాడిదల సంఖ్య తగ్గుముఖం పట్టడమే కాకుండా.. అంతరించే పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన చైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇతర దేశాల్లోని తోలు విక్రయదారులను ఆకర్షించే పనులు మొదలుపెట్టింది.. గాడిదల చర్మం, మాంసం దిగుమతులపై  విధించే సుంకాన్ని ఏకంగా 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.

ఈ నేపథ్యంలో డబ్బుకు ఆశపడిన ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లోని కొందరు స్మగ్లర్లు తమ దేశంలోని గాడిదలను నిలువునా తెగ నరుకుతున్నారు. వాటి నుంచి మాంసం, చర్మం వేరు చేసి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. తమకు జీవనాధారంగా నిలుస్తున్న గాడిదలను కొందరు దొంగిలిస్తుండటంతో ఆఫ్రికాలో ఉన్న పలువురు నిరసనగళం వినిపిస్తున్నారు.

ఇది ఇప్పుడు పలు దేశాల్లో ఉద్యమంగా రూపాంతరం చెందడంతో 14 ఆఫ్రికా దేశాలు స్పందించాయి. గాడిదల చర్మం, మాంసం రవాణాపై నిషేధాన్ని విధించాయి. అయినప్పటికీ అక్రమ మార్గాల్లో రవాణా కొనసాగుతూనే ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాడిదల జాతి ఆఫ్రికాలో కనుమరుగయ్యే అవకాశం ఉందని పలువురు సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.