మనం ఏదైనా హోటల్‌కో.. రెస్టారెంట్‌కో వెళ్లినప్పుడు సర్వర్‌కు ఆర్డర్ ఇవ్వడం.. కడుపు నిండా తిన్నాకా మనకు సర్వీస్ చేసిన వెయిటర్‌కు ఎంతో కొంత టిప్పు ఇవ్వడం కామన్. ఆ టిప్పు కూడా ఓ పదో.. ఇరవయ్యో.. మహా అయితే వందో ఇస్తాం కానీ  ఇక్కడ ఏకంగా ఓ వ్యక్తి ఏకంగా రూ.7 లక్షల రూపాయలు టిప్పుగా ఇచ్చి సర్వర్‌తో పాటు హోటల్ సిబ్బందిని షాక్‌కు గురిచేశాడు.

ఓ వ్యక్తి అమెరికాలోని ‘‘ సూప్ డాగ్స్ ’’ రెస్టారెంట్‌కు వెళ్లాడు.. అక్కడ వాటర్ ఆర్డర్ ఇవ్వగా.. సర్వర్ ‌గా ఉన్న అలైనా కస్టర్ అనే యువతి సర్వ్ చేసింది. అతను నీళ్లు తాగి వెళ్లిపోయాడు.. వెంటనే అలైనా గ్లాస్ తీసుకుందామని టేబుల్ దగ్గరకు వెళ్లి చూడగా... డాలర్ నోట్ల కట్ట కనిపించింది.. పక్కనే ఓ చీటీ కూడా ఉంది.

‘‘రుచికరమైన వాటర్ సర్వ్ చేసినందుకు కృతజ్ఞతలు అని రాసి వుంది.. ఆ డబ్బును మొత్తం లెక్కపెట్టగా.. 10 వేల డాలర్లు ( భారత కరెన్సీలో రూ.7 లక్షలు) ఉన్నాయి. దీంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆ ఆశ్చర్యంలో ఉండగానే అతడు మరోసారి వచ్చి ఓ హగ్ ఇచ్చి వెళ్లాడు...

దీంతో ఆ యువతి మరింత ఆశ్చర్యానికి గురైంది. అతను ఎవరో కాదు యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్‌గా గుర్తింపు పొందిన జిమ్మీ డొనాల్డ్‌సన్.. చాలీ చాలని జీతం తీసుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్న అలైనా‌కు ఈ బంపర్ ఆఫర్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టిప్పుగా వచ్చిన ఈ సొమ్ము మొత్తాన్ని తనతో పాటు పనిచేస్తోన్న, చదువుకుంటున్న వారికి ఇస్తానంటోంది కస్టర్.