Coronavirus: పెరుగుతున్న కరోనా కేసులు... డబ్ల్యూహెచ్‌వో ఆందోళన !
Covid-19 cases: కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. 50 కి పైగా దేశాల్లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయనీ, ప్రపంచ దేశాలు కోవిడ్-19 మహమ్మారి ముగిసిపోలేదని విషయంపై దృష్టి సారించాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు.
World Health Organization: గత కొంత కాలంగా చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతోంది. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల పుట్టుకురావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, దక్షిణ కొరియా సహా పలు యూరప్ దేశాల్లో కరోనా వైరస్ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇటీవల గుర్తించిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఇప్పటివరకు వేగంగా వ్యాపించే.. అధిక ప్రభావం కలిగిన వేరియంట్ల కంటే 10 రెట్లు ప్రభావితమైనవిగా ఉంటాయని అంచనాలున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. 50 కి పైగా దేశాల్లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయనీ, ప్రపంచ దేశాలు కోవిడ్-19 మహమ్మారి ముగిసిపోలేదని విషయంపై దృష్టి సారించాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. "కోవిడ్ -19 మహమ్మారి ముగిసిపోలేదని హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రస్తుతం 50 కి పైగా దేశాలలో కోవిడ్-19 కేసుల ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటం వైరస్ ప్రభావం స్థిరంగా అధికమవుతున్నదనే దానికి నిదర్శనమని" పేర్కొంది. కరోనా వైరస్ నుంచి పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు, సబ్ వేరియంట్లు కొత్త కేసుల పెరుగుదలకు కారణం అవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు.
ముఖ్యంగా కరోనా వేరియంట్లు ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5, బీఏ.2ల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నదని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. కరోనా కేసులు పెరుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరడం, ఇంతకు ముందుతో పోలిస్తే మరణాలు తక్కువగానే ఉంటున్నాయనీ, అవి త్వరగా పెరగడం లేదని తెలిపారు. టీకాలు అందించడంతో కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరడం, మరణాలు రేటు తక్కువగా ఉందని చెప్పారు. అయితే, టీకా కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోవిడ్-19 ప్రభావం పెరుతున్నదని తెలిపారు. ఏదేమైనప్పటికీ.. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, కరోనా మహమ్మారి ముగిసిపోలేదని విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 6,280,287 మంది కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాల్లో కలిపి 518,480,076 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా టాప్ లో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, రష్యా, సౌత్ కొరియా, ఇటలీ, టర్కీ, స్పెయిన్ లు ఉన్నాయి.