బ్రిటన్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ తన తొలి ప్రసంగం ఆకట్టుకునే విధంగా చేశారు. దేశాన్ని గాడిలో పెట్టేందుకు కొన్ని కఠిన చర్యలు తప్పవని రిషి సునాక్ స్పష్టం చేశారు.
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్‌తో భేటీ అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయానికి విచ్చేసి.. దేశ ప్రధాని హోదాలో తొలి ప్రసంగం చేశారు. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో వున్న దేశాన్ని బయటపడేసేందుకు కఠిన చర్యలు తప్పవని సునాక్ సంకేతాలిచ్చారు. లిజ్ ట్రస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుతానని.. ఆర్ధిక సుస్థిరత, ఆర్ధిక భరోసా అంశాలు తమ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనవని రిషి పేర్కొన్నారు. లిజ్ ట్రస్ కూడా తన వంతు బాధ్యతను చేసేందుకు శ్రమించారని ఆయన కొనియాడారు. గత ప్రధాని చేసిన తప్పులను సరిచేస్తానన్న నమ్మకంతోనే తనను పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని రిషి సునాక్ అన్నారు.
ఇక.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పాలనను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన ఆప్యాయత, ఔదార్యాలు ఎంతో విలువైనవని రిషి పేర్కొన్నారు. 2019లో కన్జర్వేటివ్ పార్టీ వెనుక అందరి కృషి వుందని.. నాటి విజయానికి కారణం మేనిఫెస్టో అన్న ఆయన.. దానిని అమలు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసమే పనిచేస్తానని.. పిల్లలు రుణగ్రస్తులుగా వుండాల్సిన అవసరం లేని వ్యవస్థను తీర్చిదిద్దుతామని రిషి సునాక్ చెప్పారు. దేశ ప్రజల కోసం రాత్రింభవళ్లు పనిచేస్తానని.. పార్టీలో తనను నమ్మారని, ఇక నమ్మాల్సింది ప్రజలేనని ఆయన పేర్కొన్నారు. పటిష్టవంతమైన జాతీయ ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తామని.. విద్య, శాంతి భద్రతలు, సంక్షేమం, సాయుధ దళాలకు మద్ధతు వంటి అంశాలపై దృష్టిపెడతానని రిషి సునాక్ స్పష్టం చేశారు.
ALso REad:బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్.. కింగ్ చార్లెస్ ‘‘రాజ’’ ముద్ర, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం
ఇకపోతే... బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునక్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సరిగ్గా దీపావళి నాడు పెన్నీ మోర్డెంట్ రేసు నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో సునక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో యూకే మొదటి భారతీయ సంతతి, మొదటి హిందూ, మొదటి శ్వేతజాతీయేతర ప్రధాన మంత్రిగా రికార్డు నెలకొల్పారు.
రెండు నెలల కిందట నాయకత్వ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 100 మంది ఎంపీల నామినేషన్ల పరిమితిని క్లియర్ చేసిన ఏకైక అభ్యర్థి అయ్యారు. దీంతో ఆటోమెటిక్ గా తదుపరి కన్జర్వేటివ్ నాయకుడు, బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు. మధ్యాహ్నం 1.59 గంటలకు హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు మోర్డాంట్ ప్రధాని రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు రిషి మనకు ఖచ్చితంగా అవసరమని తోటి నాయకులు భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. వారు మంచి విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రిషితో కలిసి పని చేయడానికి రుణపడి ఉంటాం. రిషికి నా పూర్తి మద్దతుద్ద ఉంది.’’ అని పేర్కొన్నారు.
ఈ పరిణామాల వల్ల బ్రిటన్ కు 200 ఏళ్లలో అతి చిన్న వయస్సులో రిషి (42 సంవత్సరాలు) ప్రధాని అయ్యారు. 1812 తరువాత ఇంత తక్కువ వయస్సున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే ప్రథమం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి కుమార్తె, రిషి భార్య అక్షతా మూర్తి, తన ఇద్దరు పిల్లలతో కలిసి అధికారిక భవనంలో నివసించనున్నారు. ఎంపీగా ఎన్నికైన ఏడు సంవత్సరాల అతి తక్కువ సమయంలో ఆయన ఉన్నత పదవిని అధిరోహించడం విశేషం.
