బ్రిటన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బోరిస్ జాన్సన్ ప్రధానిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం నుంచి ఆయన పార్టీ నుంచి సుమారు 50 మందికి పైగా రాజీనామాలు చేశారు. కానీ, బోరిస్ మాత్రం పీఎంగా కొనసాగుతానని భీష్మించుకు కూర్చున్నారు.
న్యూఢిల్లీ: బ్రిటన్ రాజకీయం సంక్షోభం దిశగా వెళుతున్నది. ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ఆయన క్యాబినెట్ మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరకత వస్తున్నది. ఆయన ప్రధానిగా దిగిపోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే బోరిస్ జాన్సన్ ప్రధానిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం నుంచి ఆయన పార్టీ నుంచి 50కిపైగా రాజీనామాలు దాఖలయ్యాయి. కానీ, ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం తగ్గేదే లేదని అంటున్నారు. ఈ వ్యతిరేకతపై తాను పోరాడతానని స్పష్టం చేశారు. తనకు బ్రహ్మాండమైన మెజార్టీ ఉన్నదని, ప్రధాని సీటును వదిలిపెట్టాల్సిన అవసరం లేదని సమర్థించుకున్నారు.
కొత్తగా ఎన్నికైన మంత్రులు కూడా బోరిస్ జాన్సన్ దిగిపోవాలని చెబుతుండటం ఆయనపై వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి. ఆయన కొత్త చాన్సిలర్ నదీమ్ జావాహి కూడా బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలని అన్నారు. కొత్తగా నియమించిన ఎడ్యుకేషన్ సెక్రెటరీ మిచెల్లే డొనెలాన్ తన పదవికి రాజీనామా చేస్తూ ఇదే డిమాండ్ చేశారు. బోరిస్ జాన్సన్ తమ అందరిని అసాధ్యమైన పరిస్థితుల్లోకి నెట్టాడని పేర్కొన్నారు.
నార్తర్న్ ఐర్లాండ్ సెక్రెటరీ బ్రెండన్ లూయీస్ మంగళవారం ఈ రాజీనామాల పరంపరకు బీజం వేశారు. ఆయన తర్వాత వెనువెంటనే మరో ఏడుగురు మంత్రులు రాజీనామాలు చేశారు. ఇందులో బోరిస్ జాన్సన్‌కు లాయల్ సపోర్టర్లుగా ఉన్న ప్రీతి పటేల్, గ్రాంంట్ షాప్స్ కూడా ఉండటం గమనార్హం. వీరిద్దరు బుధవారం రాజీనామాలు చేశారు. కేవలం బుధవారం రోజు అంటే 24 గంటల్లో 40కిపైగా మంత్రులు, ఆయన అనుచరులు రాజీనామాలు చేయడం దేశంలో కలకలం రేపింది. బుధవారం రాత్రి 11 గంటలకు వెల్ష్ సెక్రెటరీ హార్ట్ స్టాండింగ్ రాజీనామా చేశారు.
మంగళవారం నాడు మంత్రి లూయీస్ తన రాజీనామాలో బోరిస్ జాన్సన్‌పై విరుచుకుపడ్డారు. తాను ఇక రాజీపడలేనని, అందుకే తన నిర్ణయం చెప్పేశానని పేర్కొన్నారు. అయితే.. జాన్సన్ చుట్టూ ఉన్నవారంతా సందేహంలోనే ఉన్నారని, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చని తెలిపారు. తాను ఈ ప్రభుత్వాన్ని బహిరంగంగానూ, వ్యక్తిగతంగానూ సమర్థిస్తూ వచ్చానని వివరించారు. కానీ, ఇప్పుడు తాము వెనక్కి తిరిగి రాలేని పరిస్థితుల్లోకి వెళ్లామని అందులో పేర్కొన్నారు.
కాగా, ప్రధాని బోరిస్ జాన్సన్ తన విమర్శకులను టార్గెట్ చేస్తూ.. మంత్రి మైఖేల్ గూవ్‌పై విమర్శలు చేశారు. మైఖేల్ గూవ్‌ను పదవి నుంచి తొలగించారు. ఒక వైపు రాజీనామాలు చేస్తుంటే మరో వైపు బోరిస్ జాన్సన్ ఈ మంత్రిని తొలగించడం సంచలనంగా మారింది. మైఖేల్ గూవ్‌ను బోరిస్ సన్నిహితులు ఒక పాముగా పేర్కొన్నారు.
బోరిస్ జాన్సన్‌పై మైఖేల్ గూవ్ పలుమార్లు విరుచుకుపడ్డారు. టోరీ లీడర్‌గా బోరిస్ జాన్సన్‌కు అందివచ్చిన అవకాశాన్ని మైఖేల్ గూవ్ గతంలో అడ్డుకున్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి బోరిస్ జాన్సన్‌ను ప్రధానిగా దిగిపోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయనను ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు.
