శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఈ రోజు శ్రీలంక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఈ రోజు శ్రీలంక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. దీంతో ఆయన శ్రీలంక 8వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిరసనలు వెల్లవెత్తడంతో అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే.. తాత్కాలిక అద్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మంగళవారం అధ్యక్ష పదవికి ప్రకటన వెలువడింది. అయితే 1978 నుండి శ్రీలంక చరిత్రలో అధ్యక్షుడిని పార్లమెంటు నేరుగా ఎన్నుకోనుండటం ఇదే మొదటిసారి. ఇక, నేడు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలయ్యాయి. అందులో 219 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో రణిల్ విక్రమ సింఘేకు 134 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన విజయం సాధించారు.
శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. రేపటి నుంచి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ ఛాంబర్ వెలుపల తనను ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. రేపటి నుంచి అన్ని పార్టీలతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమని చెప్పారు. అయితే రణిల్ విక్రమ సింఘేపై కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఎంపీలు ఆయనకు మద్దతుగా నిలవడంతో.. నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి ఆయన ఎన్నికపై నిరసనకారులు ఎలాంటి వైఖరి తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.
ఇక, శ్రీలంక అధ్యక్ష పదివికి పోటీ పడిన వారిలో రణిల్ విక్రమసింఘే, శ్రీలంక పోడుజన పెరామునా (ఎస్ఎల్పీపీ) పార్లమెంటేరియన్ దుల్లాస్ అలహపెరుమా, నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) నేత అనురా కుమార దిసానాయకేలు ఉన్నారు. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. శ్రీలంక తదుపరి అధ్యక్షుడికి జరిగే ఓటింగ్ లో తమ పార్టీ సమాగి జన బాలవేగయ (ఎస్ జేబీ) అలహపెరుమాకు మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.
