దుబాయ్: కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులతో సమావేశమయ్యారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు.గత ఏడాది మార్చిలో హోదా కోసం ఏపీకి చెందిన నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ధర్నా చేసినా కూడ ప్రభుత్వం నుండి స్పందన రాలేదన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధానమంత్రి మర్చిపోయారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 

ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా కలిసి భారత ప్రభుత్వానికి, మోడీకి అర్థమయ్యేలా చెప్పాలని ఆయన కోరారు. దుబాయ్ అభివృద్ధిలో భారత కార్మికుల పాత్రను ఎవరూ కూడ విస్మరించలేరని చెప్పారు.