పాకిస్థాన్ లో రోడ్డెక్కిన పీటీఐ మద్దతుదారులు.. దేశ వ్యాప్తంగా నిరసనలు.. అసలేమైందంటే ?
పాకిస్థాన్ లో ఎన్నికల ఫలితాల్లో (Pakisthan Elections Results 2024) తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పీటీఐ (PTI) నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ పీటీఐ (PTI), పీపీపీ (PPP), పీఎంఎల్-ఎన్ (PML-N) పార్టీలు కోర్టులకు వెళ్లాయి.
పాకిస్థాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగడం, రాజకీయ పరిస్థితులపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ), ఇతర పార్టీల మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్నారు. 24.1 కోట్ల జనాభా కలిగిన పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఫలితాలు మందకొండిగా వస్తుండటంతో పరిస్థితులు మొత్తం మారిపోతున్నాయి.
కాగా.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 133 అవసరం అవుతాయి. అయితే ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడలేదు. దీంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ పార్టీ అతిపెద్ద పార్టీ అని ప్రకటించారు. అయితే తనకు సంఖ్యాబలం లేదని అంగీకరించి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలను ఆహ్వానించారు. ఆయన బద్ధశత్రువు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా విజయం సాధించారని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాకిస్థాన్ లో పరిస్థితులపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది, పీటీఐ చైర్మన్ గోహర్ అలీ ఖాన్ స్పందించారు. పాకిస్తాన్ లోని అన్ని సంస్థలు ప్రజల తీర్పును గౌరవించాలని అన్నారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ దేశ తదుపరి ప్రధానిని నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల కాకపోతే ఆదివారం రిటర్నింగ్ అధికారి కార్యాలయాల ఎదుట పీటీఐ శాంతియుతంగా నిరసనలు తెలుపుతుందని ఆయన చెప్పారు.
పీటీఐ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు 100కు పైగా స్థానాల్లో విజయం సాధించారని పాకిస్థాన్ ఎన్నికల సంఘం తెలిపింది. నవాజ్ షరీఫ్ కు చెందిన పీఎంఎల్-ఎన్ 72 స్థానాలను కైవసం చేసుకుంది. హత్యకు గురైన ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 స్థానాలను గెలుచుకుంది. ఇతర చిన్న పార్టీలు కలిసి 27 సీట్లు గెలుచుకున్నాయని పేర్కొంది.
266 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో గురువారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 48 గంటలు దాటినా ఇంకా కొన్ని స్థానాల్లో ఫలితాలు వెలువడలేదు. సాంకేతిక లోపాలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, అడపాదడపా ఉగ్రదాడులతో కౌంటింగ్ నిలిచిపోయింది. అయితే ఎన్నికల చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణపై 'బ్యాట్' అనే ఎన్నికల గుర్తు కింద ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్ ను , అతడి పిటిఐను ఎన్నికల సంఘం నిషేదించింది. అయితే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు.
ఇదిలా ఉండగా.. తమ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ పీటీఐ, పీపీపీ, పీఎంఎల్-ఎన్ పార్టీలు వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో విజేతలుగా ప్రకటించిన అభ్యర్థులను ఆ తర్వాత ఓడిపోయినట్టుగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని ఆయా పార్టీలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్, మోసపూరిత ఆరోపణలపై అమెరికా, యూకే, ఈయూ ఆందోళన వ్యక్తం చేశాయి. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు జరగాలని, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరాయి.