రష్యా బలహీనపడుతుందనే ఉద్దేశంతో ఇంకా కొంత కాలం పాటు ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగాలని కొన్ని నాటో మిత్ర దేశాలు కోరుకుంటున్నాయని టర్కీ దేశం ఆరోపించింది. అయితే ఏ ఏ దేశాలు ఇలా భావిస్తున్నాయో వాటి పేర్లు మాత్రం ప్రత్యేకంగా పేర్కొనలేదు.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఇంకా దాడులు కొన‌సాగిస్తూనే ఉంది. దీనికి ఉక్రెయిన్ బ‌ల‌గాలు కూడా ధీటుగా స‌మాధానం ఇస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే యుద్దం ప్రారంభ‌మై రెండు నెలలు పూర్త‌వుతోంది. యుద్ధం ఆపేందుకు రెండు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న శాంతి చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వుతున్నాయి. దీంతో రెండు దేశాలకు విప‌రీత‌మైన ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రుగుతోంది. ఉక్రెయిన్, ర‌ష్యా సేన‌ల‌కు జ‌రుగుతున్న ఈ భీక‌ర యుద్ధం వ‌ల్ల అమాయ‌క‌మైన పౌరులు చ‌నిపోతున్నారు. ఇరు దేశాల‌కు చెందిన సైనికులు కూడా మ‌రణిస్తున్నారు. 

ఈ యుద్ధం ఇలా కొన‌సాగుతున్న క్ర‌మంలో నాటో దేశాల‌పై ట‌ర్కీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఉక్రెయిన్ పై ర‌ష్యా సుధీర్ఘం కాలం పాటు యుద్ధం చేయాల‌ని కొన్ని నాటో మిత్ర దేశాలు కోరుకుంటున్నాయ‌ని చెప్పింది. ఇలా ఎక్కువ కాలం పాటు యుద్దం జ‌ర‌గ‌డం వ‌ల్ల ర‌ష్యా బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కావూసోగ్లు CNN టర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

‘‘యుద్ధం కొనసాగాలని కోరుకునే వాటిలో నాటోలోని దేశాలు ఉన్నాయి ’’ అని ఆయ‌న అన్నారు. గత నెల ఇస్తాంబుల్‌లో జరిగిన చివరి ముఖాముఖి సమావేశం తర్వాత ఉక్రెయిన్, ర‌ష్యాల‌ మధ్య చర్చలు నిలిచిపోయినట్లు కనిపిస్తున్న నేప‌థ్యంలో ‘‘రష్యా బలహీనంగా మారాలని వారు కోరుకుంటున్నారు’’ అని అన్నారు. అయితే ఆయ‌న ఏ నాటో మిత్ర దేశం పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌లేదు. 

కాగా NATO సభ్య దేశంగా ఉన్న టర్కీ ఉక్రెయిన్ కు యుద్ధంలో స‌హాయం చేసింది. దీని కోసం యుద్ధ డ్రోన్‌లను సరఫరా చేసింది, అయితే పాశ్చాత్య మిత్రదేశాలతో కలిసి రష్యాపై ఆంక్షలు విధించలేదు. వాటికి దూరంగా ఉంది. కానీ ఈ దేశం ఉక్రెయిన్, ర‌ష్యాతో మంచి సంబంధాలను కలిగి ఉంది. కాబ‌ట్టి ఈ రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న వివాదాన్ని ముగింపు పలికేందుకు ప్ర‌య‌త్నించింది. దీని కోసం మధ్యవర్తిత్వం కూడా వహించింది. ఈ దేశం నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది.

టర్కీ రెండు సార్లు రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. మార్చి 10వ తేదీన ఉక్రేనియన్, రష్యా విదేశాంగ మంత్రుల మధ్య జ‌రిగిన చర్చ‌ల‌కు దక్షిణ నగరం అంటాల్యాలో, మార్చి 29న ఇస్తాంబుల్‌లో ఇరుపక్షాల సంధానకర్తల మధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌కు ఈ దేశ‌మే మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించింది. అయితే ఈ చ‌ర్చ‌లేవీ ఫ‌లించ‌లేదు. యుద్ధం ఆపేందుకు ప‌లు దేశాలు కూడా ప్ర‌య‌త్నిస్తున్నాయి. కానీ చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వుతున్నాయి.