ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం శత్కీరా ప్రాంతంలో ఉన్న వందలయేళ్ల ప్రాచీన జెవోరేశ్వరీ కాళీ మాత దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామమైన ఐశ్వరిపూర్ లో కొలువైన ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇరు దేశాల నుంచి అనేకమంది భక్తులు నిత్యం వస్తుంటారు. ఇక్కడ ప్రధానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మోడీ ఆలయంలో కింద కూర్చుని ప్రార్థనలు చేశారు. అమ్మవారికి చేతితో తయారు చేసిన కిరీటాన్ని బహూకరించారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రోత్సాహంతో బంగారు, వెండిలతో సంప్రదాయ వృత్తికారులు మూడు వారాలు కష్టపడి తయారు చేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘ఈ అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకోవడం నా అదృష్టం. కిరీటం సమర్పించి మొక్కుకున్నాడు. కోవిడ్ 19 నుంచి సమస్త జాతిని విముక్తం చేయాలని ఆ కాళీమాతను ప్రార్థించాను’ అన్నారు. 

గుడి ప్రాంగణంలో కమ్యూనిటీ కాంప్లెక్స్ నిర్మించడానికి భారత ప్రభుత్వంకు అనుమతి ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరామని మోడీ తెలిపారు. ఇరు దేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారి సౌకర్యార్థం బాగుంటుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అంటే తుఫాన్లలాంటి పరిస్థితుల్లో ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. 

హిందూ పురాణాల ప్రకారం జెవోరేశ్వరీ కాళీ మాత దేవాలయం 51 శక్తి పీఠాల్లో ఒకటి. 16వ శతాబ్దంలో ఓ హిందూ రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. బంగ్లాదేశ్ పర్యటనకు ముందు జెవోరేశ్వరీ కాళీ మాత ఆలయాన్ని సందర్శించనున్నట్టు మోదీ ప్రకటించారు. 2015లో మోదీ మొదటిసారి బంగ్లాదేశ్ లో పర్యటించినప్పుడు ఢాకాలోని ఢాకేశ్వరి దేవాలయంలో పూజలు చేసిన సంగతి తెలిసిందే.