Asianet News TeluguAsianet News Telugu

స్వలింగ సంపర్కం నేరం కాదు, పాపం మాత్రమే.. వారిని చర్చిలోకి రానివ్వాలి.. పోప్ ఫ్రాన్సిస్..

స్వలింగ సంపర్కలు మీద అనేక దేశాల్లో ఉన్న నేర చట్టాలను తీసేయాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. స్వలింగ సంపర్కం నేరం కాదని, వారిని చర్చలోకి రానివ్వాలని పిలుపునిచ్చారు. 

pope francis comments on homosexuality, calls for end to anti gay laws - bsb
Author
First Published Jan 26, 2023, 8:44 AM IST

వాటికన్ సిటీ : పోప్ ఫ్రాన్సిస్ స్వలింగ సంపర్కుల మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  స్వలింగ సంపర్కం నేరం కాదు అంటూ..  వాటిని నేరంగా పరిగణించే చట్టాలను పోప్ ఫ్రాన్సిస్  తీవ్రంగా తప్పుపట్టారు. ‘స్వలింగ సంపర్కం నేరం కాదు. నేరంగా చూసే అలాంటి చట్టాలు అనైతికమైనవి. తన పిల్లలందరినీ దేవుడు సమానంగా.. ఎలాంటి షరతులు లేకుండానే ప్రేమిస్తాడు’.. అంటూ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం తెలిపారు. అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈ మేరకు అభిప్రాయపడడం  ఇప్పుడు చర్చలకు దారి తీసింది.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ కొందరు కేథలిక్ బిషప్ లు కూడా  స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను సమర్థిస్తున్నారు. ఈ విషయం నాకు తెలుసు. అయితే, నేను కోరేదల్లా ఒక్కటే.. స్వలింగ సంపర్కుల పట్ల కఠినంగా కాకుండా కాస్త మృదువుగా వ్యవహరించాలి. వారికి కూడా చర్చిలోకి అనుమతి ఉంటుంది. దీన్ని పాటించాలి. వారిని స్వాగతించాలి. వారిని గౌరవించాలి తప్ప వారి పట్ల వివక్ష చూపించకూడదు.  అవమానించకూడదు’  అని పోప్ సూచన చేశారు.

స్వలింగ సంపర్కం నేరం అనే చట్టాలను తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. అయితే, స్వలింగ సంపర్కం మాత్రం పాపమేనని పోప్ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ‘స్వలింగ సంపర్కం అనేది ఒక దృక్కోణం. అయితే, ఈ విషయంలో ఆయా సాంస్కృతిక నేపథ్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకుంటూ వెళితే ఇతరులపై జాలి, దయ చూపించకపోవడం కూడా పాపం కిందికే వస్తుంది.. అందుకే పాపాన్ని, నేరాన్ని విడివిడిగా చూడాలి. అలా చూసే దృష్టిని అలవాటు చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు.

పాకిస్తాన్ లో వరుస గ్యాస్ లీక్ ఘటనలు.. నలుగురు చిన్నారులతో సహా 16 మంది మృతి..

స్వలింగ సంపర్కాన్నికేథలిక్ బోధనలు తప్పుడు చర్యగానే పేర్కొంటున్నాయని.. అయితే, వారిని అవమానించడం లేదని అన్నారు. స్వలింగ సంపర్కులను కూడా ఇతరులతో సమానంగా గౌరవం పొందేలా చూడాలని చెబుతున్నాయని అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలు క్యాథలిక్ చర్చ్ ప్రకారం నిషేధం. స్వలింగ సంపర్కాన్ని దాదాపు 67 దేశాల్లో నేరంగా పరిగణిస్తున్నారు. ఈ 67 దేశాల్లో 11 దేశాల్లో అయితే స్వలింగ సంపర్కులకు మరణశిక్ష కూడా విధించే ఆస్కారం ఉండే చట్టాలను రూపొందించారు. ఈ చట్టాలను రద్దు చేయాలని హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ ఉద్యమిస్తోంది. 

అమెరికాలో కూడా స్వలింగ సంపర్కాన్ని 12 రాష్ట్రాలకుపైగా నేరంగానే పరిగణిస్తున్నాయి. గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచ దేశాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో  పోప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios