అమెరికా పర్యటనలో వున్న ప్రధాని నరేంద్ర మోడీ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు . ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ , ఆయన సతీమణి జిల్ బైడెన్‌లు మోడీకి ఘన స్వాగతం పలికారు.
ప్రధాని నరేంద్ర మోడీకి వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌లు మోడీకి ఎదురొచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆ దేశ సాయుధ దళాల నుంచి మోడీ గౌరవ వందనం స్వీకరించారు. ప్రధానికి గౌరవ సూచికంగా 19 గన్ సెల్యూట్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై బైడెన్, మోడీలు సంతకాలు చేశారు.
అనంతరం మోడీ మాట్లాడుతూ.. అగ్రరాజ్యంలో తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు , 4 మిలియన్ల మంది భారతీయ అమెరికన్లకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. 3 దశాబ్ధాల క్రితం సామాన్యుడిగా అమెరికాకు వచ్చినట్లు ప్రధాని గుర్తుచేసుకున్నారు. నాడు వైట్‌హౌస్‌ను బయటి నుంచి చూశానని.. ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికాను సందర్శించానని మోడీ తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
జో బైడెన్ మాట్లాడుతూ.. భారత్, అమెరికాల బంధం చాలా గొప్పదన్నారు. రెండు గొప్ప దేశాలు 21వ శతాబ్ధపు గమనాన్ని నిర్వచించగలరని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ అమెరికాలు కలిసి పనిచేయడం చాలా అవసరమన్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు, హెల్త్ కేర్, ఆహార భద్రత వంటి అంశాల్లో భారత్, అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయని బైడెన్ తెలిపారు.
