భూటాన్ లో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం.. ‘మేరే బడే భాయ్’ అంటూ తోబ్గే ట్వీట్..
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటన్ కు వెళ్లారు. అక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో ను అందుకోనున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం భూటాన్ కు చేరుకున్నారు. ఆ దేశంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అయితే అక్కడ ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు.
అనంతరం పారో నుండి థింఫు వరకు మొత్తం 45 కిలో మీటర్ల పొడవున నిలబడిన ఆ దేశస్తులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని వెళ్లే దారి గుండా ఓ మానవ గోడ కట్టినట్టు కనిపించింది. అక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రధానిపై అభిమానాన్ని చాటుకున్నారు.
పర్యటన విశేషాలివే..
భూటాన్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ముందుగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్ చుక్, ఆయన తండ్రి హిమాలయ దేశ నాల్గవ రాజు అయిన జిగ్మే సింగ్యే వాంగ్ చుక్ లతో ప్రధాని మోడీ సమావేశమవుతారు. తరువాత భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గేతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇంధన పొదుపు, ఆహార భద్రత ప్రమాణాలపై సహకారంపై షెరింగ్ టోబ్గేతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలను ప్రధాని మార్పిడి చేసుకుంటారు.
ఈ పర్యటనలో భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పోను ప్రధాని నరేంద్ర మోడీ అందుకోనున్నారు. భారత్-భూటాన్ సంబంధాల బలోపేతానికి, 2021లో 5,00,000 డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించినందుకు గాను భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్చుక్ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
ప్రధాని భూటాన్ పర్యటన సందర్భంగా షెరింగ్ టోబ్గే ఆప్యాకరమైన ట్వీట్ చేశారు. ‘‘భూటాన్ కు స్వాగతం.. నా సోదరుడు, ప్రధాని నరేంద్ర మోడీ జీ’’ అంటూ ఆయన పోస్టు చేవారు. కాగా.. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే గత వారం ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చారు. గత జనవరిలో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి విదేశీ పర్యటన కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అనంతరం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. వివిధ పరిశ్రమల అధినేతలతో సమావేశాలు, ఇతర కీలక కార్యక్రమాలను నిర్వహించారు.