Asianet News TeluguAsianet News Telugu

జీ20 సదస్సు వేదికగా ప్రధాని మోదీ, జో బైడెన్‌ల మధ్య ఆత్మీయ ఆలింగనం.. వైరల్ అవుతున్న వీడియో..

ఇండోనేషియాలో బాలి వేదికగా  జరుగుతున్న జీ20 సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒకరినొకరు చాలా అప్యాయంగా పలకరించుకున్నారు.

PM Modi and Joe Biden share warm hug at G20 summit
Author
First Published Nov 15, 2022, 12:58 PM IST

ఇండోనేషియాలో బాలి వేదికగా  జరుగుతున్న జీ20 సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒకరినొకరు చాలా అప్యాయంగా పలకరించుకున్నారు. జీ20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లకు పక్కపక్కనే కూర్చొవాల్సి ఉంది. ఆ సమయంలో అటుగా వచ్చిన బైడెన్.. మోదీ వద్ద ఆగారు. ఇద్దరు షేక్ ఇచ్చుకుని.. అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను పీఎంవో ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతుంది. ఈ పరిణామంపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తరార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అధ్యక్షుడు బైడెన్, పీఎం మోదీ మధ్య స్నేహం స్పష్టంగా ఉంది’’ అని అన్నారు. 

 

ఇక, జీ20 సమావేశానికి ముందు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోదీ కరచాలనం చేయడం కనిపించింది. ఇద్దరు నాయకులు చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. తాము సంక్షిప్త చర్చలు జరిపామని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇక, జీ20 సదస్సు సందర్భంగా.. ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి ప్రపంచ ఆందోళనకు సంబంధించిన కీలక అంశాలపై తాను ఇతర జీ20 నాయకులతో విస్తృత చర్చలు చేయనున్నట్టగా మోదీ చెప్పారు. జీ20 సమ్మిట్ సమావేశంలో పాల్గొనే అనేక ఇతర దేశాల నాయకులతో సమావేశం కానున్నట్టుగా తెలిపారు. వారితో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించనున్నట్టుగా పేర్కొన్నారు. నవంబర్ 15 న రిసెప్షన్‌లో బాలిలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. 

‘‘ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో బాలి సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో భారతదేశానికి జీ20 ప్రెసిడెన్సీని అందజేయనున్నారు. ఇది దేశానికి, పౌరులకు ముఖ్యమైన క్షణం. 2022 డిసెంబర్ 1 నుంచి భారతదేశం అధికారికంగా జీ20 ప్రెసిడెన్సీని స్వీకరిస్తుంది. వచ్చే ఏడాది మన దేశంలో జరిగే G20 సమ్మిట్‌కు సభ్యులు, ఇతర ఆహ్వానితులకు కూడా నేను నా వ్యక్తిగత ఆహ్వానాన్ని అందిస్తాను’’ అని మోదీ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios