Asianet News TeluguAsianet News Telugu

కెనడాలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్ల మృతి

కెనడాలో తేలికపాటి విమానం ఒకటి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మరణించారు. అందులో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు ఉన్నారు. వీరిద్దరూ ముంబైకి చెందిన వారు. ఈ ప్రమాదంపై వారి తల్లిదండ్రులకు అక్కడి అధికారులు సమాచారం అందించారు.

Plane crashed in Canada Two trainee pilots died..ISR
Author
First Published Oct 7, 2023, 1:25 PM IST | Last Updated Oct 7, 2023, 1:27 PM IST

కెనడాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లో శనివారం ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మృతి చెందారు. ఈ పైలట్లను భయ్ గద్రూ, యశ్ విజయ్ రాముగాడే గా గుర్తించారు. వీరు భారత్ లోని ముంబైకి చెందిన వారని ‘ఇండియా టుడే’ పేర్కొంది. 

పైపర్ పీఏ-34 సెనెకా అనే రెండు ఇంజిన్ల తేలికపాటి విమానం చిల్లివాక్ నగరంలోని ఓ హోటల్ వెనుక చెట్లు, పొదల్లో కూలిపోయిందని కెనడా పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో భారతీయులతో పాటు మరో పైలట్ కూడా మృతి చెందారు. కాగా.. ఘటనా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని కెనడా పోలీసులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయానికి సమీపంలోని మోటెల్ (హైవేపై ఉన్న హోటల్) ప్రాంతంలో విమానం కూలిపోయింది. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్ల మరణంపై ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించారు. కాగా.. ఘటనపై సమాచారం అందిన వెంటనే కెనడా ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అలాగే ఐదు అంబులెన్స్‌లు, ఒక వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి.  అయితే ఘటనా స్థలానికి రెండు ఎయిర్ అంబులెన్స్‌లు వచ్చినా.. తరువాత అవి వెనక్కి వెళ్లిపోయాయి. 

ఈ  ఘటన వల్ల ఆ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి గాయాలు కాలేదని, మరే ఇతర ప్రమాదమూ జరగలేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కెనడా రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు ప్రారంభించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios