5-11 ఏళ్లలోపు చిన్నారులకు ఫైజర్ టీకా సురక్షితమని ఆ సంస్థ సీఈఓ  అల్బర్డ్ బౌర్లా తెలిపారు.. తమ టీకా తీసుకొన్న చిన్నారుల్లో యాంటీబాడీస్ ప్రతిస్పందన కన్పించిందని తెలిపింది ఫైజర్ సంస్థ.5 నుండి11 ఏళ్ల మధ్య వయస్సున్న 2,268 మంది చిన్నారుల్లో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.  

ఫ్రాంక్‌పర్డ్: ఐదేళ్ల నుండి 11 ఏళ్ల లోపు చిన్నారులకు తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని ఫైజర్, బయో‌ఎన్‌టెక్ సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో చిన్నారులను కరోనా నుండి రక్షించేందుకు ఈ వ్యాక్సిన్ దోహదపడనుందని ఫైజర్ సీఈఓ అల్బర్డ్ బౌర్లా తెలిపారు.

ఐదు నుండి 11 ఏళ్ల వయస్సు చిన్నారులకు ఈ టీకా సురక్షితమైందని క్లినికల్ ట్రయల్స్ లో తేలిందని ఆ సంస్థ తెలిపింది. చిన్నారుల శరీరాల్లో యాంటీబాడీల ప్రతిస్పందనలు చూపించిందని ఫైజర్ సంస్థ తెలిపింది.ఈ క్లినికల్ డేటాను ఫైజర్ సంస్థ యూరోపియన్ యూనియన్, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖలకు పంపనుంది.

12 ఏళ్లలోపు చిన్నారులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఇదే మొదటిది. ఆరు నుండి 11 ఏళ్ల చిన్నారులపై కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మోడర్నా సంస్థ క్లినికల్ ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.5 నుండి11 ఏళ్ల మధ్య వయస్సున్న 2,268 మంది చిన్నారుల్లో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే 12 ఏళ్లు దాటిన వారికి ఇచ్చన డోసు కంటే తక్కువ డోసు ఇచ్చారు. ఈ టీకా తీసుకొన్న చిన్నారుల్లో యాంటీబాడీస్ ఉత్పత్తి అయిందని ఫైజర్ సంస్థ ప్రకటించింది.ఇతర వ్యాక్సిన్ తీసుకొన్నవారిలో మాదిరిగానే జ్వరం, తలనొప్పి, వంటివి ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.