ఫ్రాన్స్‌లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడానికి పోలీసులు ఓ యువకుడిని షూట్ చేసి చంపేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు పెల్లుబికాయి. పోలీసు వాహనాలను, ప్రజా ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. 

న్యూఢిల్లీ: యూరప్ కంట్రీ ఫ్రాన్స్‌లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించాడని పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటన నంతెరెలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలకు ఎక్కింది. దేశవ్యాప్తంగా ఈ ఘటనను నిరసిస్తూ రోడ్డెక్కారు. పోలీసుల తీరును దారుణంగా విమర్శిస్తున్నారు. పలుచోట్ల అల్లర్లు జరుగుతున్నాయి.

పోలీసులు తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఎందుకు కాల్చాల్సి వచ్చిందో వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. మెర్సిడెస్ కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఆ కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందని పోలీసులు దానికి అడ్డుగా వెళ్లారు. కారును ఆపేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల గురించి అడగ్గా.. కారులోని యువకుడు అలాంటిదేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. 

కారు ఇంజిన్ ఆపేసిన ఆ యువకుడు మళ్లీ స్టార్ట్ చేశాడని, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వెంటనే కారు ఇంజిన్ స్టార్ట్ చేసి మూవ్ అయ్యే ప్రయత్నం చేశారని పోలీసు వర్గాలు వివరించాయి. అప్పుడు షూట్ చేయాల్సి వచ్చిందని తెలిపాయి. కానీ, వీడియో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాస్తవాన్ని తెలియజేస్తున్నది.

కారును పక్కకు తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు పోలీసులు రెండు తుపాకులు ఆ యువకుడి తలకు గురి పెట్టినట్టు కనిపించింది. కదిలితే చంపేస్తామని, బుల్లెట్లు నీ బుర్రలోకి చీల్చుకెళ్లుతాయని వార్నింగ్ చేస్తున్నట్టు ఉన్నది. అప్పుడే చాలా సమీపంగా యువకుడిని షూట్ చేశారు. ఈ ఘటనలో యువకుడు మరణించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Also Read: మధ్యప్రదేశ్ లోనూ కర్ణాటక ఫార్ములా.. ఫోన్ పే లోగోపై చౌహాన్ ఫొటో తో కాంగ్రెస్ ప్రచారం..మండిపడ్డ పేమెంట్స్ కంపెనీ

చాలా చోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. అవి హింసాత్మకంగానూ మారాయి. ఒక చోట పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. మరో చోట ప్రయాణికులను కిందికి దింపేసి బస్సును తగులబెట్టారు. చాలా చోట్ల ట్రాష్ బిన్‌లను కాల్చేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టగా.. వారిని అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులు వారిపైకి రాళ్లు విసిరిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. రెండో రోజూ ప్యారిస్ అట్టుడుకుతున్నది. 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మ్యాక్రన్ మాట్లాడుతూ.. యువకుడిని చంపేసిన ఘటన అన్యాయమైనదని స్పష్టం చేశారు.