Asianet News TeluguAsianet News Telugu

సంక్షోభంలో పాకిస్థాన్: లక్షా 50 వేల ఉద్యోగాలకు గండం, 6 మంత్రిత్వ శాఖలు రద్దు

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగాల కోత విధించనుంది. ఐఎంఎఫ్ రుణ ఒప్పందంలో భాగంగా లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.

Pakisthan'sIMF Agreement: 150,000 Jobs Cut, 6 ministries closed to reduce cost GVR
Author
First Published Sep 29, 2024, 9:56 PM IST | Last Updated Sep 29, 2024, 10:01 PM IST

పొరుగు దేశం పాకిస్థాన్‌ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో దారుణ పరిస్థితులు నెలకొనడంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. కాగా, సెప్టెంబర్ 26 న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఎట్టకేలకు సహాయ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ ఖర్చులను తగ్గించడానికి హామీ ఇచ్చాక మొదటి విడతగా 1 బిలియన్ డాలర్లకు పైగా నిధులను విడుదల చేసింది.

7 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కింద ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న సంస్కరణల్లో భాగంగా పరిపాలనా వ్యయాలను తగ్గించే ప్రయత్నంలో ఉంది దాయాది దేశం పాకిస్థాన్‌. ఇందులో భాగంగా దాదాపు లక్షా 50 వేల ప్రభుత్వ పోస్టులను రద్దు చేస్తామని ప్రకటించింది. అలాగే, ఆరు మంత్రిత్వ శాఖలను మూసివేస్తామని, మరో రెండింటిని విలీనం చేస్తామని ఆదివారం వెల్లడించింది.

ఖర్చులను తగ్గించడం, పన్ను- జీడీపీ నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, స్థిరాస్తి లాంటి సంప్రదాయేతర రంగాలపై పన్ను విధించడం, సబ్సిడీలను పరిమితం చేయడం, కొన్ని ఆర్థిక బాధ్యతలను ప్రావిన్సులకు బదిలీ చేయడం లాంటి పనులు చేస్తామని పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)కి హామీ ఇచ్చింది. ఆ తరువాత సెప్టెంబర్ 26న సహాయ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది ఐఎంఎఫ్‌.

ఈ సందర్భంగా, అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ సయీద్ మీడియాతో మాట్లాడారు. ఐఎంఎఫ్‌తో ఒక కార్యక్రమం ఖరారైందని తెలిపారు. ఇది పాకిస్థాన్ కు చివరి కార్యక్రమం అని ఆయన చెప్పారు. ఇదే చివరి కార్యక్రమమని నిరూపించుకునేందుకు తమ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని, జీ20లో చేరాలంటే ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించాలని ఔరంగజేబ్‌ పేర్కొన్నారు..

మంత్రిత్వ శాఖల్లో రైట్ సైజింగ్ జరుగుతోందని, ఆరు మంత్రిత్వ శాఖలను మూసివేసే నిర్ణయం అమలు కానుందని, రెండు మంత్రిత్వ శాఖలను విలీనం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా వివిధ మంత్రిత్వ శాఖల్లో 1,50,000 పోస్టులను తొలగించనున్నట్లు ఔరంగజేబ్ తెలిపారు.

పన్ను వసూళ్లపై పాక్ దృష్టి..

అలాగే, పన్ను ఆదాయాన్ని పెంచడంపై ఔరంగజేబ్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. గత సంవత్సరం సుమారు 3 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు ఉన్నారని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, 7 లక్షల 32 వేల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని.... దేశంలో మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 16 లక్షల నుంచి 32 లక్షలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

నాన్ ఫైలర్స్ కేటగిరీని రద్దు చేస్తామని, పన్నులు చెల్లించని వారు ఇకపై ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరని ఔరంగజేబ్ తెలిపారు.

పాకిస్థాన్‌లో తగ్గిన ద్రవ్యోల్బణం..

ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనిస్తోందని, దేశ విదేశీ మారక నిల్వలు పెరిగాయని, గరిష్ట స్థాయికి చేరుకున్నాయని పాక్‌ మంత్రి ఔరంగజేబ్‌ పేర్కొన్నారు. జాతీయ ఎగుమతులు, ఐటి ఎగుమతులు రెండింటిలోనూ గణనీయమైన వృద్ధిని ఆయన ఎత్తిచూపారు. ఆర్థిక వ్యవస్థ బలంపై పెట్టుబడిదారుల విశ్వాసం పెద్ద విజయమని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీ రేటును 4.5 శాతం తగ్గించిందని, మారకం రేటు, పాలసీ రేటు ఆశించిన విధంగానే కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గిందన్నారు.

కాగా, గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి కష్టపడుతోంది. ఇది 2023లో డిఫాల్ట్‌కు దగ్గరగా ఉంది. ఐఎంఎఫ్ సకాలంలో 3 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడం పాకిస్థాన్‌ మేలు చేసినట్లే.

ఇదే చివరి రుణం అవుతుందన్న ఆశ, నిబద్ధతతో పాకిస్తాన్ అంతర్జాతీయ రుణదాతతో దీర్ఘకాలిక రుణం కోసం చర్చలు జరిపింది. అయితే, దేశం ఇప్పటికే ఐఎంఎఫ్‌ నుంచి అనేక సార్లు రుణాలను పొందింది. దీంతో శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంలో ఆ విఫలమైందన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios