జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్‌కు పాకిస్థాన్ లేఖ రాసింది . మసూద్ అజార్ ఆఫ్ఘనిస్థాన్‌లో తలదాచుకున్నాడని పాకిస్థాన్ ఆరోపిస్తుంది.
కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌కు లేఖ రాసింది. మసూద్ అజార్‌ను గుర్తించడం, అరెస్టు చేయడంలో పాకిస్థాన్‌కు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ సహాయం చేయాలని ఈ లేఖలో కోరింది. మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హర్ లేదా కునార్ ప్రావిన్స్‌లో దాక్కుని ఉండవచ్చని పాకిస్థాన్ పేర్కొంది.
ఎఫ్‌ఏటీఎఫ్ ఒత్తిడి కారణంగా మసూద్ అజార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ లేఖ రాసి ఉండొచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. డిసెంబర్ 31, 1999న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసి 814 హైజాక్ తర్వాత మసూద్ అజార్ ను భారత్ విడుదల చేసింది. ఈ క్రమంలో భారత్ తో పాటు ఐక్యరాజ్య సమితి కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పరిగణించింది.
ఉగ్రవాది మసూద్ అజార్ ఆఫ్ఘనిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడని పాకిస్థాన్ పేర్కొంది. ఈ సందర్బంగా పాక్ విదేశాంగ కార్యాలయ అధికారి మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు. మసూద్ అజార్‌ను గుర్తించి, నివేదిక ఇవ్వాలని, అరెస్టు చేయాలని కోరినట్టు అందులో పేర్కొన్నట్టు తెలిపారు. మసూద్ ఆఫ్ఘనిస్థాన్‌లోనే ఎక్కడో చోట దాక్కున్నాడని భావిస్తున్నామని తెలిపారు. అయితే.. పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు, తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ కూడా పాకిస్తాన్ నుండి అలాంటి లేఖ అందలేదని నిర్ద్వంద్వంగా ఖండించారు. మాకు ఇంకా ఎలాంటి లేఖ రాలేదని ముజాహిద్ తెలిపారు.
మసూద్ అజార్‌పై పాకిస్థాన్ నిషేధం
మసూద్ అజార్ నంగర్‌హర్ లేదా కునార్ ప్రావిన్స్‌లో తలదాచుకుని ఉండొచ్చని పాకిస్థాన్ భావిస్తుంది. కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడానికి ముందు లేదా తర్వాత అజార్ ఆఫ్ఘనిస్తాన్‌కు వలస వెళ్లాడా? అనేది ఇంకా ధృవీకరించబడలేదు. జనరల్ పర్వేజ్ ముషారఫ్ హయాంలో ఉగ్రవాద ఆరోపణలపై జనవరి 14, 2002న జైషే మహ్మద్‌పై పాకిస్థాన్ నిషేధం విధించింది. ఆ తర్వాత మసూద్ కింగ్‌పిన్ ISI రక్షణ కస్టడీలోకి వెళ్లాడు.
మసూద్ ట్రస్టులపై కూడా నిషేధం
జైష్-ఎ-మహ్మద్‌పై 17 సంవత్సరాల నిషేధం తరువాత.. మే 10, 2019న పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ, నిఘా ఆధారంగా.. బహవల్‌పూర్ లోని అల్-రహమత్ ట్రస్ట్, కరాచీలోని అల్-ఫుర్కాన్ ట్రస్ట్ అనే రెండు సంస్థలను నిషేధించింది. ఈ రెండు ట్రస్టులు మసూద్ అజార్ ఉగ్రవాద సంస్థలనీ, వీటి ద్వారానే జైషే ఏక్ మహ్మద్‌కు నిధులు వచ్చేవనీ, అయితే, తన ట్రస్ట్‌పై నిషేధం తర్వాత కూడా, మసూద్ అజార్ అనేక ఇతర సంస్థలు, ట్రస్టులను ప్రారంభించినట్టు తెలుస్తుంది. వాటి ద్వారా అతడు పాకిస్తాన్ తో పాటు విదేశాల నుండి కూడా భారీ మొత్తంలో విరాళాలు అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
మసూద్ అజార్ గ్లోబల్ టెర్రరిస్టు
2019 ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. మసూద్ అజార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌కు లేఖ రాయడం ఇది రెండోసారి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో మంత్రుల స్థాయి చర్చల సందర్భంగా మసూద్ అజార్ అరెస్ట్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తింది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, ఉగ్రవాది మసూద్ అజార్‌ల పేర్లను ప్రపంచ ఉగ్రవాద సంస్థల జాబితాలో నమోదు చేయాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్‌పై చైనా మాత్రం అడ్డుకట్ట వేస్తుంది.
గత నాలుగు సంవత్సరాలుగా పాకిస్తాన్ ను ఉగ్రవాదుల ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్ ) గ్రే లిస్ట్‌లో ఉంది. గత నెల 28, సెప్టెంబర్ 3 మధ్య వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ఎఫ్‌ఏటీఎఫ్ బృందం పాకిస్తాన్‌కు చేరుకుంది. ఈ సమయంలో మౌలానా మసూద్ అజర్ చాలా కాలం క్రితం ఆఫ్ఘనిస్తాన్‌కు పారిపోయినందున పాకిస్తాన్‌లో అతని జాడలేడని పాకిస్తాన్ ఎఫ్‌ఏటీఎఫ్ కి తెలిపింది. అక్టోబర్‌లో జరగనున్న ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. కానీ, ఇందుకోసం 34 పాయింట్ల ఎజెండాను అనుసరించాల్సి ఉంటుంది.
