కాశ్మీర్ విషయంలో భారత దేశం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ మినహా ఇతర దేశాలన్నీ సమర్థించినట్లు కనిపిస్తోంది. భారత్ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే... పాక్ వెంటనే వ్యతిరేకించింది. తన అక్కసునంతటినీ వెల్లగక్కింది. అయితే ఈ విషయంలో పాక్ కి ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి కూడా కనీస మద్దతు లభించకపోవడం గమనార్హం.

జమ్మూకాశ్మీర్ కి ఉన్న ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడం... ఐరాస తీర్మానాలకు వ్యతిరేకమంటూ పాక్ విమర్శనాస్త్రాలు గుప్పించింది. అయితే.. ఇస్లామిక్ దేశాల సమాఖ్య మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మలేషియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఫోన్ లో మాట్లాడినా... వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం.

పాక్‌కు అత్యంత మిత్రదేశమైన చైనా కూడా ప్రకటనలకు దూరంగా ఉంది. నిజానికి భారత్‌ ప్రకటించిన కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ లో చైనా ఆక్రమిత భూభాగం (6వేల చ.కిలోమీటర్లు) ఉంది. సోమవారం నాటి భారత్‌ నిర్ణయంపై డ్రాగన్‌ దేశం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఆర్టికల్‌-370పై భారత్‌ నిర్ణయం వెలువడిన తర్వాత ఇంగ్లండ్‌లో ఉన్న కశ్మీరీల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ‘‘భారత్‌ నిర్ణయంతో జమ్మూకశ్మీర్‌ నామరూపాలు కోల్పోయింది’’ అని యునైటెడ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌నేషనల్‌ పార్టీకి చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ షబ్బీర్‌ చౌదరి వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్‌లో ఉంటున్న హిందూ కశ్మీరీలు, అమెరికాలోని ఎన్నారైలు భారత్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ లెక్కన పాక్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా నిలవగా... భారత్ విజయం సాధించినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. 

related news

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా