పాక్ సైన్యం కస్టడీలో ఉన్న భారత్ వింగ్ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను విడుదుల చేస్తున్నట్లా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అప్పగింతకు సంబంధించిన లాంఛనాలు కూడా పూర్తవుతున్నాయి..

దీంతో అభినందన్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభినందన్‌ను విడుదల చేయొద్దంటూ పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఆ దేశ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం భారత పైలట్‌ను విడుదల చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయ్ పాలనలో ఉన్న విధంగా భారత్ ప్రస్తుతం లేదన్నారు.

మోడీ ఆలోచనలు వేరుగా ఉన్నాయని... కార్గిల్ యుద్ధ సమయంలో ఒక్క భారత యుద్ధ విమానం కూడా సరిహద్దు దాటలేదని...కానీ మోడీ పాలనలో ఏకంగా 14 జెట్లు పాక్ భూభాగంలోకి వచ్చాయని అహ్మద్ గుర్తు చేశారు.

త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మోడీ కావాలనే పాక్‌పై దాడులు చేయించారని వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు అభినందన్‌ను విడుదల చేసిన తర్వాత మోడీ మరోసారి దాడి చేయరని నమ్మకం ఏంటని రషీద్ ప్రశ్నించారు.

మోడీ మరోసారి పాక్‌పై దాడులు చేయిస్తే మన పరిస్ధితి ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం పాకిస్తాన్ గురించి ఆలోచిస్తున్నాడని రైల్వే మంత్రి వ్యాఖ్యానించారు.