ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో పాక్ రాజకీయాలు హాట్ హాట్‌గా వున్న సంగతి తెలిసిందే. మిత్రపక్షాలు కూడా మద్ధతు ఉపసంహరించడంతో ఇమ్రాన్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ఇమ్రాన్.  

పాకిస్తాన్‌లో (pakistan) పరిణామాలు మరింత వేగంగా మారిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (imran khan) . ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు (no-confidence motion) రాకముందే ఇమ్రాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఓటింగ్ ద్వారా అధికారాన్ని కోల్పోవాల్సిన అవసరం లేకుండానే.. ఇమ్రాన్ ముందుగానే రాజీనామా చేసే పరిస్ధితి తలెత్తింది. మరి ఇమ్రాన్ తనకు తాను రాజీనామా చేసి గౌరవప్రదంగా తప్పుకుంటారా..? లాంఛనప్రాయ ఓటింగ్ కోసం ఆగుతారా..? అన్నది తేలాల్సి వుంది. మరి సాయంత్రం ఇమ్రాన్ ఏం మాట్లాడతారు అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. 

అంతకుముందు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో (Pakistan National Assembly) ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు సోమవారం ప్రవేశపెట్టాయి. దిగువ సభలో ఈ తీర్మానాన్ని పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్ ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మాన ప్రవేశానికి అనుమతి తీసుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి 161 మంది నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరీ సభను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.

ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఓటింగ్ కోసం కనీసం మూడు రోజుల ఎడం ఉండాలని స్పీకర్ ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సభను మూడు రోజుల తర్వాతకు వాయిదా వేశారు. ఓటింగ్‌ను కనీసం మూడు రోజుల తర్వాత లేదా ఏడు రోజుల లోపే నిర్వహించనున్నారు. అంటే ఈ అవిశ్వాస తీర్మానంపై 31వ తేదీన ఓటింగ్ జరగొచ్చు లేదా ఏడు రోజుల్లోపు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నది. దీంతో పాకిస్తాన్‌లో పొలిటికల్ టెంపరేచర్ పరాకాష్టకు చేరుతున్నది.

ఈ సభ మొత్తం బలం 342. ప్రధాని ఖాన్‌ను పదవి నుంచి దింపేయాలంటే ప్రతిపక్షాల వైపు నుంచి కనీసం 172 ఓట్లు పడాలి. కచ్చితంగా 172 మంది చట్టసభ్యులు ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాగా, ఖాన్ సారథ్యంలోని పీటీఐ సభ్యులు 155 మంది (Pakistan Tehreek-e-Insaf) ఉన్నారు. ఇతర మిత్రపక్షాల మద్దతుతో తాము ఈ అవిశ్వాస పరీక్షపై గెలిచి తీరుతామని ప్రభుత్వ పక్షం వాదిస్తున్నది. కానీ, పీటీఐ మిత్రపక్షాలూ (Muttahida Qaumi Movement (MQM) ఆయనకు దూరంగా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, సొంత పార్టీ నుంచే ఆయనపై తిరుగుబాటు చేసి పార్టీకి అందుబాటులో లేకుండా పోయారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఆసక్తి రేపుతున్నది.

పాక్ రాజకీయాలు ఈ నెల 8వ తేదీ నుంచి హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా అదే రోజు ప్రతిపక్షాలు స్పీకర్‌కు విజ్ఞప్తి సమర్పించాయి. దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణ కోల్పోవడం, ధరలు పతనం కావడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వమే కారణం అని ఆరోపించాయి. 14 రోజుల్లో సెషన్ నిర్వహించాలనీ అవి కోరాయి. దీంతో మూడు రోజుల తప్పనిసరి నిబంధనతో ఈ నెల 25వ తేదీన స్పీకర్ నేషనల్ అసెంబ్లీ సెషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే.