పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దైంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ.. జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసు మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దైంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ.. జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసు మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రద్దు కావడంతో పాక్ కేబినెట్ రద్ద అవుతుందని పాక్ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు. ప్రధాని పదవిలో ఇమ్రాన్ ఖాన్ కొనసాగుతారని చెప్పారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 ప్రకారం ప్రధాని తన విధులను కొనసాగిస్తారు. మంత్రివర్గం రద్దు చేయబడింది’’ అని పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు.
అంతకు ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి తిరస్కరించారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వెనక విదేశీ కుట్రకు ఉందన్నారు. ఈ కారణంతో డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించలేదు. అయితే అవిశ్వాస తీర్మానం సమయంలో ఇమ్రాన్ ఖాన్ సభకు హాజరుకాలేదు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో డిప్యూటీ స్పీకర్ సభను వాయిదా వేశారు.
తనపై అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైన అనంతరం ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్‌లో ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు ఆరిఫ్ అల్విని కోరారు. ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తనపై కుట్ర జరిగిందన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం.. పాకిస్తాన్‌పై జరిగిన విదేశీ కుట్ర అని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రజలను ఇమ్రాన్ అభినందించారు.
‘‘అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షునికి లేఖ రాశాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఎన్నికలకు సిద్ధం కావాలని పాకిస్థాన్‌కు నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాల ఆందోళన..
ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేసిన డిప్యూటీ స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పార్లమెంట్‌ను విడేది లేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతించలేదని.. దీనిపై ప్రతిపక్షాలు ఉమ్మడిగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టుగా చెప్పారు. తమ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారని చెప్పారు. పాకిస్తాన్ రాజ్యాంగాన్ని రక్షించడానికి, సమర్థించడానికి, అమలు చేయడానికి.. తాము అన్ని సంస్థలను కోరుతున్నట్టుగా చెప్పారు.
