ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ సతీమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖాన్ వివాదాస్పద వ్యక్తి అని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టే గుణమున్న మనిషి అని వివరించారు. కాబట్టి, సుప్రీంకోర్టు కచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ది వివాదాస్పద క్యారెక్టర్ అని పేర్కొన్నారు. ఎప్పుడు ఏదో గొడవ, చిచ్చులు ఉద్దేశపూర్వకంగా పెట్టే గుణమున్న ఇమ్రాన్ ఖాన్‌పై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవిపై కీలక నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు విచారించడానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మొదటి నుంచీ ఆయనది వివాదాస్పదమైన వ్యక్తిత్వం అని రెహమ్ ఖాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని దారుణంగా పక్కదారి పట్టిస్తున్న ఆ వ్యక్తిని ఆపద్ధర్మ ప్రధానిగా, ఆయన ఎంచుకున్న ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరుగుతాయని ఎవరైనా ఎలా అంగీకరించగలరు అని ప్రశ్నించారు. ఆయన ఎంచుకున్న సెటప్‌ను కచ్చితంగా తిరస్కరించాల్సిందే అని తెలిపారు.
కొత్తగా ఎన్నికలు నిర్వహించాలనే ఒకే ఒక్క ప్రతిపాదనతో ఇది వరకే తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాలను చట్టబద్ధం చేయరాదని, ఉపేక్షించరాదని ట్వీట్ చేశారు. అసలు తాజాగా ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అని నిర్ణయించే అధికారం ఇమ్రాన్ ఖాన్‌కు లేదని, ఆయన ఆ రాజ్యాంగ హక్కు లేదని వివరించారు. కాబట్టి, ప్రతి చట్ట ఉల్లంఘనను గుర్తించి మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా శిక్ష వేయాలని తెలిపారు.
అంతేకాదు, మరో ట్వీట్‌లో తన విమర్శలను మరింత పదును చేశారు. పాకిస్తాన్ ప్రజలను ప్రభావితం చేయడానికి ఈ మనిషిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చిచ్చులు పెట్టే ఈ వ్యక్తిపై సుప్రీంకోర్టు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
పాకిస్థాన్ ప్రధాని (pakistan prime minister) ఇమ్రాన్ ఖాన్‌పై (imran khan) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (No-Trust Motion) ఓటింగ్ జరుగుతుందనుకున్న వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఓటింగ్ జరగకుండా ప్రధాని ఇమ్రాన్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇదే సమయంలో అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకుంటే నేషనల్ అసెంబ్లీని ( national assembly) రద్దు చేస్తానని కూడా ఆయన ఆఫర్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమన్నారు నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరీ (qasim suri) . ఈ మేరకు ఆయన ఓటింగ్‌ను తిరస్కరించారు.
ఆ వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్. అలాగే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని సిఫారసు మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ (arif alvi) ప్రకటించారు. జాతీయ అసెంబ్లీ రద్దు అయినప్పటికీ పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ కొనసాగనున్నారు. అయితే, తాజా పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
