Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో ఇమ్రాన్ హవా : ఇండియాలోనే అనుకున్నాం.. పాక్‌లోనూ ఇంతేనా , జైలుకెళ్తే ఈ స్థాయిలో సింపతీనా..?

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జైలులో వున్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధిస్తున్నారు. జైలులో వుండి కూడా ఇమ్రాన్ చక్రం తిప్పారు. తమ పార్టీ నేతలను స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్ వేయించారు. 

pakistan People show sympathy on Imran khan party in elections ksp
Author
First Published Feb 10, 2024, 11:49 AM IST

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జైలులో వున్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా వున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇమ్రాన్ సారథ్యంలోని తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన స్వతంత్ర అభ్యర్ధులు అత్యధిక సీట్లను సొంతం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన ముస్లిం లీగ్ (నవాజ్) .. (పీఎంఎల్ఎన్) రెండో స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు వుండగా.. వీటిలో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఒక స్థానంలోల అభ్యర్ధి మరణించడంతో ప్రస్తుతం 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 133 కాగా.. ఇప్పటి వరకు 226 స్థానాల ఫలితాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. 

ఇమ్రాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధులు 92, పీఎంఎల్ఎన్ 64, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 50 , ఇతర చిన్న పార్టీలు 20 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాల్సిందిగా నవాజ్ షరీప్ పిలుపునిచ్చారు. కానీ ఇమ్రాన్ పార్టీ మాత్రం తాము ఎవరితోనూ చేతులు కలిపేది లేదని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అయితే బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీతో నవాజ్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు వున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

అయితే ఇమ్రాన్‌ఖాన్‌ను సమస్యలు చుట్టుముడుతున్నా.. దేశ రాజకీయాల్లో ఈ స్థాయిలో సంచలనం రేపుతారని ఎవ్వరూ ఊహించి వుండరు. ఇమ్రాన్, ఆయన భార్య పలు కేసుల్లో జైలుకు వెళ్లడంతో ఇక పాక్ రాజకీయాల్లో ఈ మాజీ కెప్టెన్ శకం ముగిసినట్లేనని అంతా భావించారు. తోషాఖానా సహా పలు కేసుల్లో జైలు శిక్ష పడటంతో ఇమ్రాన్‌ ఖాన్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. అంతేకాకుండా పలు కారణాలతో పీటీఐ పార్టీ గుర్తు బ్యాట్‌ను కూడా రద్దు చేశారు. పీటీఐ అభ్యర్ధుల నామినేషన్లను కూడా ఈసీ తిరస్కరించింది. అయితే జైలులో వుండి కూడా ఇమ్రాన్ చక్రం తిప్పారు. తమ పార్టీ నేతలను స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్ వేయించారు. 

ఇమ్రాన్ జైల్లో వుండటం, ఆయనపై వేధింపులు ప్రజల్లోకి విస్త్రృతంగా వెళ్లేలా పీటీఐ అభ్యర్ధులు ప్రచారం చేయడం వర్కవుట్ అయ్యింది. ఇంకేముందు ఇమ్రాన్‌పై సానుభూతి పవనాలు వీచాయి. దాని ప్రతిఫలమే ఎన్నికల్లో ఈ ఫలితాలు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios