పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే గద్దె దిగే అవకాశాలు ఉన్నాయి. అవిశ్వాస తీర్మానానికి మెజార్టీ ఓట్లు వస్తే.. ఖాన్ గద్దెదిగడం అనివార్యం. ఈ నేపథ్యంలోనే దేశానికి కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా రాజకీయం సంక్షోభం అంచులకు చేరింది. ఏ క్షణంలో ఏం జరిగేది అర్థం కాకుండా ఉన్నది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు లేదని స్పష్టంగా బయటకు కనిపిస్తున్నది. దీంతో ఆయన విదేశీ కుట్ర అనే అంశాన్ని ముందుకు తెచ్చాడు. ఇదే విషయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు ముందు ఉంచాడు. ఇదిలా ఉండగా, అవిశ్వాస తీర్మానంపై రేపు ఓటింగ్ జరిగే తీరుతుందని, అందులో ఇమ్రాన్ ఖాన్ ఓటమి తప్పదనే ధీమాలో ప్రతిపక్షం ఉన్నది. అదే సందర్భంలో కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతున్నది. ఇంతకీ ఎవరీ షాబాజ్ షరీప్? పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఏమవుతాడు? ఇంతకు ముందు ఏం చేశాడు?
పాకిస్తాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటాడని చెబుతున్న షాబాజ్ షరీఫ్ ప్రతిపక్ష పార్టీ పీఎంఎల్ ఎన్ చీఫ్. పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు ఈయన సోదరుడు. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్తాన్ తదుపరి ప్రధాన మంత్రిగా ఈయనే బాధ్యతలు తీసుకుంటారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టో బుధవారం కొన్ని సంకేతాలు ఇచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం మెజార్టీ కోల్పోయిన నేత అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇక ఎంతమాత్రం ప్రధాని కాదని అన్నారు. రేపటి పార్లమెంటు సెషన్‌లో ఓటింగ్ జరగనివ్వండని, అందులోనే మ్యాటర్ సెటిల్ అవుతుందని వివరించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని వెల్లడించారు. అదే సందర్భంలో ఆయన షాబాజ్ షరీఫ్ త్వరలో ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.
షాబాజ్ షరీఫ్ 1997లో తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ సారథ్యంలో జరిగిన తిరుగుబాటు కారణంగా 1999లో ఆయన పాకిస్తాన్ వదిలి వెళ్లిపోయాడు. 2007లో మళ్లీ పాకిస్తాన్ తిరిగి వచ్చాక 2008లో పంజాబ్ సీఎంగా గెలిచాడు. 2013లోనూ మూడోసారి కూడా సీఎంగా గద్దెనెక్కాడు. కాగా, 2018 జనరల్ ఎన్నికల్లో ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగాడు. కానీ, ఆ ఎన్నికల్లో పీటీఐ ఆధిక్యం సాధించడంతో ఇమ్రాన్ ఖాన్ పీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై (imran khan) ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (no-confidence motion) చర్చ జరగనుంది. మిత్రపక్షాల మద్ధతు కోల్పోయిన నేపథ్యంలో బలపరీక్ష జరిగితే ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగానే కన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయ అనిశ్చితికి చెక్ పెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రతిపాదన చేశారు. విపక్షాలు అవిశ్వాసాన్ని ఉపసంహరించుకున్నట్లయితే తాను జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని ఆఫర్ ఇచ్చారు.
ఈ మేరకు జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్‌కు సందేశం పంపినట్లు పాకిస్థాన్ జియో న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. ఒకవేళ ఈ ఆఫర్‌కు ప్రతిపక్షాలు అంగీకరిస్తే పాకిస్థాన్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అయితే విపక్షాలు మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లుగాత తెలుస్తోంది. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధి షాజియా మారీ తెలిపినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
